కార్గిల్ యుద్ధవీరుడు కల్నల్ సోనం వాంగ్‌చుక్ కన్నుమూత
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:39 PM
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రిటైర్డ్ కల్నల్ సోనం వాంగ్‌చుక్ శుక్రవారంనాడు లద్దాఖ్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 ఏళ్లు.
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రిటైర్డ్ కల్నల్ సోనం వాంగ్‌చుక్ (Colonel Sonam Wangchuk) శుక్రవారంనాడు లద్దాఖ్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 ఏళ్లు. 'లైన్ ఆఫ్ లద్దాఖ్'గా పేరున్న ఆయన మూడు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలందించారు. 5,500 మీటర్ల ఎత్తులో గట్టకట్టే చలిలో మంచు రిడ్జ్‌పై రాత్రంతా గడిపిన సాహసిగా ఆయనకు పేరుంది.
లెహ్‌లో 1964లో జన్మించిన సోనం వాంగ్‌చుక్ అక్కడి మోడ్రన్ స్కూలులో చదివారు. ఢిల్లీ యూనివర్శిటీ వెంకటేశ్వర కాలేజీలో హిస్టరీలో గ్రాడ్యుయేట్ చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని అస్సాం రెజిమెంట్ 4వ బెటాలియన్‌లోకి అడుగుపెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్నారు. లద్దాఖ్ స్కౌట్స్‌కు వెళ్లక ముందు శ్రీలంకలో ఐపీకేఎఫ్ మిషన్‌లో పాల్గొన్నారు.
శత్రువులను చీల్చిచెండాడిన వాంగ్‌చుక్
కార్గిల్ యుద్ధంలో లద్దాఖ్ స్కౌట్స్ దళానికి కల్నల్ సోనం వాంగ్‌చుక్ సారథ్యం వహించారు. 1999 మే 30-31 రాత్రి అత్యంత కఠినమైన వాతావరణంలో, ఎత్తైన పర్వత ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో హోరాహోరా కాల్పులు జరిగినా వెనక్కి తిరిగిచూడలేదు. ముందుకు దూసుకువెళ్లి శత్రు సైనికులను మట్టుబెట్టి, స్థావరాలను ధ్వంసం చేశారు. ఆయన చూపించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 'మహావీర్ చక్ర'తో సన్మానించింది.
రాజ్‌నాథ్ సింగ్ నివాళి
రిటైర్డ్ కల్నల్ సోనం వాంగ్‌చుక్ మృతికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. లద్దాఖ్ వీరపుత్రుడుగా ఆయనను అభివర్ణించారు. దేశసేవకే తన జీవితాన్ని అంకింతం చేశారని, ఆపరేషన్ విజయ్‌లో ఆయన చూపించిన ధైర్య సాహసాలు, తన సహచర సైనికుల్లో నింపిన స్ఫూర్తి ప్రశంసనీయమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు
లెబనాన్‌పై దాడులు.. పెద్దఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన