కార్గిల్ హీరో గదిని గుడిగా మార్చిన తల్లి.. 27 ఏళ్లుగా కొడుకు జ్ఞాపకాలతో..
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:05 PM
కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన గ్రెనేడియర్ ఉదయ్‌మాన్ సింగ్ గదిని ఆయన తల్లి గుడిలా మార్చేశారు. కొడుకు జ్ఞాపకాలను ఆ గదిలో భద్రపరిచారు. 27 ఏళ్లుగా ఆ జ్ఞాపకాలలోనే దూరమైన కొడుకును చూసుకుంటున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన గ్రెనేడియర్ ఉదయ్‌మాన్ సింగ్ గదిని ఆయన తల్లి గుడిలా మార్చేశారు. కొడుకు జ్ఞాపకాలను ఆ గదిలో భద్రపరిచారు. 27 ఏళ్లుగా ఆ జ్ఞాపకాలలోనే దూరమైన కొడుకును చూసుకుంటున్నారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఓ జాతీయ మీడియా ఉదయ్‌మాన్ సింగ్ ఇంటికి వెళ్లింది. ఉదయ్‌మాన్ తల్లిని, సోదరిని ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్‌లోని శామాచక్‌కు చెందిన గ్రెనేడియర్ ఉదయ్‌మాన్ సింగ్ 1999 టైగర్ హిల్‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందారు.
శత్రువుల తూటాలు తగిలి నిట్టనిలువుగా ఉన్న కొండపై నుంచి కింద పడిపోతున్నా.. వెనక్కి తగ్గకుండా, శత్రువులకు భారీ నష్టం చేకూరుస్తూ చివరి శ్వాస వరకు పోరాడారు. అప్పటికి ఆయన వయసు 18 సంవత్సరాలు మాత్రమే. ఉదయ్‌మాన్ మరణం తర్వాత తల్లి కాంతా దేవి ఆయన గదిని గుడిలా మార్చేశారు. ఉదయ్‌మాన్‌కు సంబంధించిన జ్ఞాపకాలను అందులో భద్రపరిచారు. ఆ గదిలోని ఓ షెల్ఫ్‌లో ఉదయ్‌మాన్ సింగ్ ప్రాణాలు తీసిన బుల్లెట్ తగిలి రంధ్రం పడిన పర్సుతో పాటు ఆ బుల్లెట్ తగిలిన ఒక రూపాయి నాణెం కూడా ఉంది.
ఉదయ్‌మాన్ పర్సులో యుద్ధ సమయంలో ఆయన సోదరి వందన రాసిన ఉత్తరాలతో పాటు, ఆయన పోస్ట్ చేయలేకపోయిన కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి. కాంతా దేవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ప్రతీరోజు ఈ గదిలోకి వస్తాను. అతడితో మాట్లాడతాను. ప్రతీ విషయాన్ని అతడితో పంచుకుంటాను. అతడు బతికున్న సమయంలో ఇలానే అన్ని విషయాలు అతడికి చెప్పేదాన్ని’ అని పేర్కొన్నారు.
ఉదయ్‌మాన్ సోదరి వందన మాట్లాడుతూ.. ‘కార్గిల్ నుంచి నాకు రెండు సార్లు ఫోన్ చేశాడు. చాలా తక్కువ సమయం మాత్రమే మాట్లాడాడు. నేను చెప్పలేకపోయిన విషయాలను లెటర్లు రాశాను. ప్రతీ రక్షా బంధన్ రోజున నా సోదరుడిని చాలా మిస్ అవుతాను. నేను ఎప్పటికీ అతడి చేతికి రాఖీ కట్టలేను. కానీ, ఓ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. అతడి త్యాగం వల్లే చాలా మంది సోదరీమణులు వారి సోదరులతో రక్షా బంధన్ జరుపుకుంటున్నారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రతీ ఏడాది రక్షా బంధన్ రోజున ఉదయ్‌మాన్ ఫొటోకు రాఖీ కడుతున్నారు.
ఇవి కూడా చదవండి
రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి
కామన్వెల్త్ గేమ్స్ 2026: భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను