ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ లాకర్ తెరిచిన మహిళకు షాక్..
ABN , Publish Date - Aug 11 , 2026 | 04:21 PM
ఓ బ్యాంకు లాకర్‌లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్‌లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి.
కాన్పూర్: ఓ బ్యాంకు లాకర్‌లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్‌లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి. లాకర్ తెరిచి చూసిన బాధితురాలికి తన ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకు యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదైంది.
కాన్పూర్‌లోని స్వరూప్‌నగర్‌కు చెందిన రష్మి అరోరా తన భర్తతో కలిసి 2003 ఫిబ్రవరి 26న అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ)లో ఖాతా తెరిచింది. అదే సమయంలో వారికి లాకర్ నంబర్ 23ని బ్యాంకు సిబ్బంది కేటాయించారు. అందులో సుమారు రూ.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను భార్యాభర్తలు భద్రపరిచారు. కొంతకాలం పాటు ఆ దంపతులు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి లాకర్‌ను పరిశీలించేవారు. రష్మి భర్త మరణించిన తర్వాత ఆమె.. లఖ్‌నవూలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. దూరం కారణంగా బ్యాంకుకు వెళ్లడం తగ్గిపోయింది. అయితే లాకర్ భద్రంగానే ఉంటుందని భావించింది. ఇదిలా ఉండగా ఎస్‌బీటీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) విలీనమైంది.
సుమారు నాలుగు నెలల కిందట కుమార్తెతో కలిసి బ్యాంకుకు వెళ్లగా రష్మి పేరుతో లాకర్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో పాత ఖాతా, లాకర్‌కు సంబంధించిన పత్రాలను తీసుకుని మరోసారి బ్యాంకుకు వెళ్లింది. అప్పుడు ఆమె ఖాతా నుంచి లాకర్ అద్దె ఆటోమేటిక్‌గా కట్ అవుతూ వచ్చిందని, దాంతో ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ కారణంగానే ఖాతా ఇన్‌యాక్టివ్ అయ్యిందని పేర్కొన్నారు. జులై 21న రష్మి తన ఖాతాలో నగదు జమ చేసి దాన్ని తిరిగి యాక్టివేట్ చేసుకుంది. అయితే, ఆ రోజు లాకర్ తాళం ఆమె వద్ద లేకపోవడంతో దానిని తెరవలేదు. అనంతరం జులై 27న తాళంతో బ్యాంకుకు వెళ్లి లాకర్ నంబర్ 23ను రష్మి తెరవగా.. ఆమెకు గుండె ఆగినంత పనైంది. లాకర్‌లో ఒక్క ఆభరణం కూడా లేదు. మొత్తం ఖాళీగా కనిపించింది.
తన నగలు మాయమవడానికి బ్యాంకు యాజమాన్యం, సిబ్బంది కుట్ర కారణమై ఉండొచ్చని రష్మి ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా బ్రాంచ్ మేనేజర్‌తో పాటు సంబంధిత సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు లాకర్ రికార్డులు, సంబంధిత పత్రాలు, సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని కాన్పూర్ డీసీపీ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..
కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం..