సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు దిలీప్ రాజ్ మృతి..
ABN , Publish Date - May 13 , 2026 | 12:59 PM
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన మరువక ముందే కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) హఠాన్మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దిలీప్ రాజ్ లేరనే వార్త చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బుధవారం తెల్లవారుజామున దిలీప్ రాజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గంమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 47 ఏళ్ల వయసులోనే, కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఆయన మృతి చెందడం కన్నడ సినీ ఇండస్ట్రీని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. 2005 లో ‘బాయ్ ఫ్రెండ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దిలీప్. 2007లో వచ్చిన ‘మిలానా’ చిత్రంలో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన తరువాత దిలీప్‌కి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. సుమారు 24 పైగా సినిమాల్లో నటించారు దిలీప్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై తన ప్రస్థానం కొనసాగించారు. ‘కంబడ మనె’ అనే టెలీఫిలింతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. నటుడిగానే కాకుండా ‘డీఆర్ క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా పలు టీవీ సీరియల్స్ కు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ సినీ ప్రముఖులు, సహ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత