Share News

నిత్యావసరాలు మరింత ప్రియం!

ABN , Publish Date - May 11 , 2026 | 02:09 AM

పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాల పెరుగుదల కారణంగా దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. దీంతో...

నిత్యావసరాలు మరింత ప్రియం!

మరోసారి ధరలు పెంచే యోచనలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు

ముడి సరుకు, ప్యాకేజింగ్‌ వ్యయాలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాల పెరుగుదల కారణంగా దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, పానీయాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే 3 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచిన ఎఫ్‌ఎంసీజీ సంస్థలు.. మార్జిన్లను కాపాడుకునేందుకు మరో విడత ధరల పెంపు తప్పదని సంకేతాలిస్తున్నాయి. వ్యయ భారాన్ని అదుపులో ఉంచడానికి ప్యాకేజీ పరిమాణం తగ్గింపు, ధరలు పెంచడం వంటి చర్యలు చేపట్టక తప్పడం లేదని అంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి భారం 10 శాతం మేర పెరిగిందని, దాన్ని తగ్గించుకునేందుకు పలు విభాగ ఉత్పత్తుల ధరలను సుమారు 4 శాతం పెంచినట్లు డాబర్‌ ఇండియా గ్లోబల్‌ సీఈఓ మోహిత్‌ మల్హోత్రా తెలిపారు. మరో వైపు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కూడా ఇంధన, ప్యాకేజింగ్‌ వ్యయాలు దాదాపు 20 శాతం పెరగడంతో త్వరలో ధరల పెంపు లేదా ప్యాక్‌ పరిమాణం తగ్గింపు చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. రూ.10 పైబడిన ప్యాక్స్‌ ధరలు పెంచాలని, కొన్ని ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు కంపెనీ ఎండీ, సీఈఓ రక్షిత్‌ హర్గెవ్‌ చెప్పారు. ముడిసరుకు వ్యయాలు 8-10 శాతం పెరిగినట్టు హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తెలిపింది. కంపెనీ ఇప్పటికే 2-5 శాతం ధరలను పెంచగా.. పరిస్థితులు ఇలానే కొనసాగితే మరోసారి ధరల సవరణ చేపట్టక తప్పదని హెచ్‌యూఎల్‌ సీఎ్‌ఫఓ నిరంజన్‌ గుప్తా స్పష్టం చేశారు. మారికో తమ హెయిర్‌ ఆయిల్‌ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే 6-7 శాతం ధరలు పెంచింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొందని, వచ్చే కొన్ని నెలల్లో మార్కెట్‌ పరిస్థితులు ఎలా మారుతాయో అంచనా వేయడం కష్టంగా మారిందని నెస్లే ఇండియా చైర్మన్‌, ఎండీ మనీశ్‌ తివారీ అన్నారు.


ఫెవికాల్‌ మరింత కాస్ట్‌లీ..

ఫెవికాల్‌, డాక్టర్‌ ఫిక్సిట్‌, ఫెవిక్విక్‌, ఎం-సీల్‌ వంటి ప్రముఖ అధెసివ్‌, కన్‌స్ట్రక్షన్‌ కెమికల్స్‌ తయారీ దిగ్గజం పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ కూడా తమ ఉత్పత్తుల ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇప్పటికే సంస్థ ఏప్రిల్‌, మే నెలల్లో రెండు విడతల్లో తన ఉత్పత్తుల ధరలను పెంచింది.

ఈ వార్తలనూ చదవండి:

'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా

ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు

Updated Date - May 11 , 2026 | 02:09 AM