ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు
ABN , Publish Date - May 09 , 2026 | 05:14 AM
శీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికాని (క్యూ4)కి స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన...
క్యూ4లో 6 శాతం వృద్ధి.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికాని (క్యూ4)కి స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.19,684 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన రూ.18,643 కోట్ల కన్నా ఇది 6 శాతం ఎక్కువ. మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు రూ.1,23,098 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన వడ్డీ ఆదాయం రూ.1,19,666 కోట్లుగా ఉంది. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 1.82 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 0.47 శాతం నుంచి 0.39 శాతానికి చేరాయి. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో ఎస్‌బీఐ నికర లాభం రూ.19,600.46 కోట్ల నుంచి రూ.19,648.87 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,79,562 కోట్ల నుంచి రూ.1,81,079 కోట్లకు పెరిగింది. కాగా మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 13 శాతం వృద్ధితో రూ.80,032 కోట్ల స్టాండ్‌ఎలోన్ నికర లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.70,901 కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్‌ను బ్యాంకు బోర్డు ప్రకటించింది.
సవాళ్లు కొనసాగితే ఇబ్బందే..
పశ్చిమాసియా యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి తమ రుణ వృద్ధి లక్ష్యం 13-15 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. అయితే ఈ సవాళ్లు మరో ఆరు నెలల పాటు కొనసాగితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ వద్ద రూ.5.5 లక్షల కోట్ల వరకు రుణ ప్రతిపాదనలున్నాయని చెప్పారు. కార్పొరేట్ రుణగ్రహీతలు జూలై నాటికి తమ మూలధన వ్యయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. యుద్ధ ప్రభావం తీవ్రంగా కాకపోయినా విస్తృతంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొత్తగా 6,000 నియామకాలు
ఎస్‌బీఐలో ప్రస్తుతం 2.45 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. కొత్తగా 6,000 మంది వరకు నియమించుకోనున్నట్టు సీఎస్ శెట్టి తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ నియామకాలుంటాయన్నారు. మైథోస్ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులు.. ఆర్‌బీఐ, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎస్‌బీఐ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్