Share News

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

ABN , Publish Date - May 08 , 2026 | 02:00 AM

అంతరిక్ష రంగానికి చెందిన హైదరాబాద్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వ్యాపార అవసరాల కోసం తాజాగా 6 కోట్ల డాలర్ల (సుమారు రూ.564 కోట్లు) నిధులు...

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

110 కోట్ల డాలర్లకు హైదరాబాద్‌ స్టార్టప్‌ విలువ జూతాజాగా 6 కోట్ల డాలర్లు సమీకరించిన సంస్థ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతరిక్ష రంగానికి చెందిన హైదరాబాద్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వ్యాపార అవసరాల కోసం తాజాగా 6 కోట్ల డాలర్ల (సుమారు రూ.564 కోట్లు) నిధులు సమీకరించిందీ సంస్థ. ఈ లావాదేవీలో భాగంగా కంపెనీ విలువను 110 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.10,340 కోట్లు) లెక్కగట్టారు. తద్వారా స్కైరూట్‌ యూనికార్న్‌గా అవతరించింది. దేశంలోని తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌ ఇదే. ఈ ఏడాదిలో యూనికార్న్‌ హోదా సాధించిన నాలుగో స్టార్ట్‌పగా నిలిచింది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.9.400కోట్లు) మార్కెట్‌ విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌గా పిలుస్తారు.

ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు..?

స్కైరూట్‌లో తాజా రౌండ్‌ పెట్టుబడులకు షెర్పాలో వెంచర్స్‌, సింగపూర్‌ ప్రభుత్వ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ సహ నేతృత్వం వహించాయి. షెర్పాలో, జీఐసీతో పాటు స్కైరూట్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన గ్రీన్‌కో గ్రూప్‌ వ్యవస్థాపకులు, ప్రపంచ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌రాక్‌, అర్కమ్‌ వెంచర్స్‌, ప్లేబుక్‌ పార్ట్‌నర్స్‌, సంఘ్వీ ఫ్యామిలీ ఆఫీస్‌ తాజా రౌండ్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఈ రౌండ్‌తో కలిపి స్కైరూట్‌ ఇప్పటివరకు 16 కోట్ల డాలర్ల (రూ.1,500 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది.

తాజా నిధులతో ఏం చేయనుందంటే..

కొత్తగా సమీకరించిన పెట్టుబడులను తయారీ సామర్థ్య విస్తరణ, విక్రమ్‌-1 లాంచింగ్‌ల ఫ్రీక్వెన్సీ పెంపు, విక్రమ్‌-2 అభివృద్ధి వేగవంతం కోసం వినియోగించనుంది.

స్కైరూట్‌ బోర్డులోకి రామ్‌ శ్రీరామ్‌

షెర్పాలో వెంచర్స్‌ వ్యవస్థాపకుడు రామ్‌ శ్రీరామ్‌ స్కైరూట్‌ బోర్డులో చేరబోతున్నారు. రామ్‌ శ్రీరామ్‌ ప్రముఖ టెక్‌ ఇన్వెస్టర్‌. అంతేకాదు, అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ బోర్డు సభ్యుడు కూడా.

2018లో ప్రారంభం

ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్‌ కుమార్‌ చందన, నాగ భరత్‌ డాకా కలిసి 2018లో స్కైరూట్‌ను ప్రారంభించారు. విక్రమ్‌ పేరుతో అంతరిక్షంలో ఉపగ్రహాలను (శాటిలైట్లు) ప్రవేశపెట్టేందుకు అవసరమైన చిన్న, మధ్యస్థాయి లాంచింగ్‌ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ. విక్రమ్‌ ఎస్‌ మిషన్‌లో భాగంగా 2002లో అంతరిక్షంలోకి రాకెట్‌ను లాంచ్‌ చేసిన తొలి ప్రైవేట్‌ కంపెనీ ఇదే. ప్రస్తుతం కంపెనీ విక్రమ్‌-1 రాకెట్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 08 , 2026 | 02:00 AM