'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా
ABN , Publish Date - May 10 , 2026 | 06:00 AM
గృహ రుణాలు తీసుకునేటప్పుడు చెల్లింపు కాలపరిమితి కూడా ముఖ్యమే. ఈ కాలపరిమితి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి వీలైనంత వరకు తక్కువగా ఉండడమే మంచిది.
సొంతింటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. ఎక్కువ మందికి ఏదో ఒక బ్యాంకు లేదా గృహ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ) నుంచి గృహ రుణం తీసుకుంటే గానీ ఈ కల నెరవేరదు. ఈ రుణాలు తీసుకునే ముందే కొద్దిగా తెలివిగా (స్మార్ట్) ఆలోచిస్తే బోలెడు ప్రయోజనాలు. ఆ స్మార్ట్ ఆలోచనలు ఏంటో తెలుసుకుందాం.
చెల్లింపు కాలపరిమితి
గృహ రుణాలు తీసుకునేటప్పుడు చెల్లింపు కాలపరిమితి కూడా ముఖ్యమే. ఈ కాలపరిమితి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి వీలైనంత వరకు తక్కువగా ఉండడమే మంచిది. రుణ చెల్లింపుల కోసం ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం వల్ల ఈఎంఐల భారం తగ్గినా, ఆఖరికి చూస్తే వడ్డీ చెల్లింపుల భారం భారీగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కాలాన్ని ఎంచుకున్నా, బోన్‌సలు లేదా ఏవైనా ఆస్తుల అమ్మకం ద్వారా పెద్దమొత్తంలో లాభా లు వస్తే ఆ మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపులకు ఉపయోగించండి. దానివల్ల హోమ్ లోన్ త్వరగా తీరిపోవడంతో పాటు వడ్డీల భారమూ తగ్గుతుంది.
ఉదాహరణ: ఒక వ్యక్తి 8 శాతం వడ్డీ రేటుతో రూ.కోటి గృహ రుణంగా తీసుకున్నాడనుకుందాం. ఈ రుణాన్ని 15 సంవత్సరాల్లో చెల్లిస్తే నెలకు రూ.95,600 చొప్పున గడువు పూర్తయ్యే సరికి చెల్లించే వడ్డీ మొత్తం రూ.72 లక్షలు అవుతుంది. అదే 25 ఏళ్ల చెల్లింపు కాల పరిమితిని ఎంచుకుంటే నెలకు రూ.77,200 ఈఎంఐ చొప్పున పాతికేళ్లలో అతను చెల్లించే వడ్డీ మొత్తమే రూ.1.32 కోట్లు అవుతుంది. ఇక్కడ 15 సంవత్సరాల కాలపరిమితిలో ఈఎంఐల భారం ఎక్కువగా అనిపించినా, వడ్డీగా చెల్లించే మొత్తం రూ.72 లక్షలు మాత్రమే. అదే పాతికేళ్ల చెల్లింపును ఎంచుకుంటే ఈఎంఐల భారం తగ్గినా, వడ్డీ చెల్లింపుల భారం మాత్రం అసలును మించిపోయింది.
స్థోమతకు తగ్గట్టే రుణాలు
ఇటీవల గృహ రుణాల మార్కెట్లోనూ పోటీ పెరిగింది. దీంతో మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి మా దగ్గర తీసుకుంటే.. మీ వార్షిక ఆదాయం కంటే ఐదారు రెట్లు గృహ రుణంగా ఇస్తామని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు ఊదరగొడుతుంటాయి. చూసేందుకు ఈ ఆఫర్లు ఆకర్షణీయంగానే ఉంటాయి. గృహ రుణాలను ఎప్పుడు అర్హతను బట్టిగాక, చెల్లింపు స్థోమతను బట్టి తీసుకోవాలి. నెలవారీ ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణ చెల్లింపులు, జీవిత అవసరాలు, పిల్లల చదువులు, రిటైర్మెంట్ పొదుపు-పెట్టుబడులు, అత్యవసర ఖర్చుల కోసం చేసే పొదుపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే గృహ రుణం ఎంత తీసుకోవాలి అనే విషయం నిర్ణయించుకోవాలి. ఈఎంఐ చెల్లింపుల భారం నెలవారీ నికర ఆదాయంలో 35 నుంచి 40 శాతం మించకుండా చూసుకుంటే మంచిది. అంతకుమించితే మాత్రం ఊహించని ఖర్చులు తలెత్తినప్పుడు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సహ రుణ గ్రహీత
ఒక్కోసారి ఇల్లు లేదా ఫ్లాట్ కొనేందుకు అవసరమైనంత స్థాయిలో మనకు గృహ రుణం లభించకపోవచ్చు. అలాంటప్పుడు కుటుంబ సభ్యులో నెలవారీ ఆదాయం ఉన్న ఎవరో ఒకరిని సహ రుణ గ్రహీతగా (కో బారోయర్) ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రుణ అర్హత పెరగడంతో పాటు మంచి ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఏర్పడుతుంది. రుణ చెల్లింపుల భారం ఇద్దరి మీద ఉంటుంది కాబట్టి ఈఎంఐల చెల్లింపుల భారమూ తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కో బారోయర్లు ఇద్దరికీ పాత పన్ను విధానం కింద ఆదాయ పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరు ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైనా, ఆ ప్రభావం ఇద్దరి క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది.
ఎంపికలో జాగ్రత్తలు
కొనే ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు ధరలు బేరీజు వేసుకున్నట్టే, గృహ రుణా లు తీసుకునేటప్పుడు అనేక విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ చార్జీలు, రుణ చెల్లింపు కాలపరిమితులను క్షుణ్ణంగా పోల్చి చూసుకోవాలి. వడ్డీ రేటు అర శాతం తగ్గినా, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చాలా ఆదా అవుతుంది. వడ్డీ రేటులో కూడా ఫిక్స్డ్ లేక ఫ్లోటింగ్ వడ్డీ రేటా అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఫ్లోటింగ్ వడ్డీ రేటైతే ఆర్బీఐ రెపో రేటు మార్చినప్పుడల్లా మీ గృహ రుణ వడ్డీ రేటు మారుతుంది. అదే ఫిక్స్డ్ వడ్డీ రేటైతే ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేసేందుకు చాలా కాలం పడుతుంది. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ చార్జీలతో పాటు ఖాతాదారులకు బ్యాంకు సకాలంలో అందించే సేవలు కూడా ముఖ్యమే.
రుణగ్రహీత బాధ్యత
తీసుకున్న గృహ రుణాన్ని సకాలంలో చెల్లించడం రుణ గ్రహీత బాధ్యత. ఈఎంఐల చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. పెనాల్టీలతో పాటు అధిక వడ్డీల భారం పడుతుంది. వీటన్నిటికంటే పెద్ద నష్టం ఈఎంఐ ల చెల్లింపుల్లో ఏ మాత్రం ఆలస్యమైనా అది ఆయా వ్యక్తుల క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. క్రెడిట్ స్కోరు దెబ్బతింటే కొత్త రుణాలు లేదా క్రెడిట్ కార్డులు తీసుకోవడం కష్టమవుతుంది. దీర్ఘకాలం పాటు ఈఎంఐలు చెల్లించ లేకపోతే బ్యాంకు ఆ ఇల్లు లేదా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకుని, తన బకాయిలు రాబట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే గృహ రుణాలు తీసుకునే వ్యక్తులు కనీసం 6 నుంచి 12 నెలల ఈఎంఐలకు సరిపడా అత్యవసర ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. చెల్లింపుల్లో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడితే బ్యాంకులకు ముందుగానే తెలియజేయడడం మంచిది. అలాంటప్పుడు ఖాతాదారుడి ట్రాక్ రికార్డు ఆధారంగా బ్యాంకులు కూడా ఈఎంఐ చెల్లింపుల్లో కొంత ఊరట కల్పించే అవకాశం ఉంది.