Share News

సినిమాను తలపించేలా రియల్ సీన్ .. గోడ వెనుక కోట్లు విలువ చేసే బంగారం..

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:00 PM

సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్‌లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ.. దాని వెనక రూ.కోట్ల విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్‌ రూమ్ బయటపడింది. ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు సైతం ఈ సీక్రెట్ వాల్ చూసి ఆశ్చర్యపోయారు..

సినిమాను తలపించేలా రియల్ సీన్ .. గోడ వెనుక కోట్లు విలువ చేసే బంగారం..
Kanha Group IT raid

జైపూర్, ఫిబ్రవరి 20: కొందరు వ్యాపారులు తమ అవినీతి సొమ్మును రహస్య గదులు, గోడలు, ఇతర ప్రదేశాల్లో దాస్తుంటారు. ఆ సీక్రెట్ ప్రదేశాలను అధికారులు గుర్తించి, నల్లధనాన్ని వెలికి తీస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఇలా రీల్‌లో జరిగే సీన్.. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో రియల్‌గా జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లోని గోడ వెనుక రూ.కోట్ల విలువచేసే బంగారాన్ని దాచిన స్ట్రాంగ్‌ రూమ్ బయటపడింది. ఇదంతా చూసి ఐటీ సోదాలకు వచ్చిన అధికారులు కూడా షాకయ్యారు. రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగవేత ఆరోపణల్లో భాగంగా కన్హా గ్రూప్‌ ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం...


ప్రముఖ ఫుడ్‌ అండ్ బెవరేజ్‌ సంస్థ కన్హా గ్రూప్‌ (Kanha Group)పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఐటీ అధికారులు.. కన్హా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల్లో ఉన్న 33 ప్రాంతాల్లో బుధవారం (ఫిబ్రవరి 18) నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జైపూర్‌లో అత్యధిక సంఖ్యలో దాడులు జరిగాయి. ఉదయపూర్‌లోని రెండు ప్రదేశాలు, శ్రీగంగానగర్, కోట, కరౌలి, హిందాన్, ముంబైలలో ఒక్కో చోట బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.


తొలి రెండు రోజుల్లో గ్రూప్‌ యజమాని ఇల్లు, ఆఫీస్‌ల్లో పలు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో రోజైన ఇవాళ సోదాల్లో అధికారులు సీక్రెట్ వాల్‌ను గుర్తించారు. దాన్ని బద్దలుకొట్టి చూడగా.. వెనక ఒక రహస్య గది ఉంది. అందులో కోట్ల విలువచేసే బంగారు నగలు ఉన్నాయి. అంతేకాక రూ.50 లక్షల నగదు కూడా లభ్యమైంది. ప్రస్తుతం ఆ గది నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని లెక్కిస్తున్నారు. భారీగా వెలుగు చూసిన ఈ నల్ల ధనం.. దర్యాప్తు తీరునే మార్చి వేయనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన పది బ్యాంక్‌ లాకర్లు బయటపడ్డాయి. వాటిలో కూడా లెక్కలోకి రాని నగదు, బంగారం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.


2008లో ఈ కన్హా గ్రూప్‌ను నట్వర్‌లాల్ శారదా స్థాపించారు. ఈ సంస్థ స్వీట్స్, బేకరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. దీని యజమానులు రూ.100 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడి, ఆ మొత్తాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ హోటళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల వేళ కూడా ఈ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగించేందుకు అధికారులు అనుమతించారు. దర్యాప్తు అధికారులు పత్రాలు, బ్యాంకు ఖాతాలు, కంప్యూటర్లలో నిల్వ చేసిన డేటాను పరిశీలిస్తుండగా అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 20 , 2026 | 08:05 PM