నేడు ప్రభుత్వ లాంఛనాలతో కల్కి భగవాన్ అంత్యక్రియలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:11 AM
కల్కి భగవాన్‌కు నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం ఆలయ వ్యవస్థాపకుడైన కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడి మృతి వార్త తెలిసి ఆయన భక్తులు ఏకం క్షేత్రానికి భారీగా చేరుకుంటున్నారు.
సత్యవేడు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కల్కి భగవాన్‌కు నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం ఆలయ వ్యవస్థాపకుడైన కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడి మృతి వార్త తెలిసి ఆయన భక్తులు ఏకం క్షేత్రానికి భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కల్కి భగవాన్ పార్ధివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఏకం క్షేత్రంలో ఉంచిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు క్షేత్రానికి పోటెత్తారు. కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతా ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా కల్కి భగవాన్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఏకం క్షేత్ర ఆవరణలో కల్కి భగవాన్ నివాసం ఏర్పాటు చేసుకున్న ఇంటి సమీపంలోని ఉద్యానవనంలో మహా సమాధి(అంత్యక్రియలు) జరపనున్నారు. శుక్రవారం ఏకం క్షేత్రం నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి కల్కి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
సీఎం చంద్రబాబు విచారం
కల్కి భగవాన్ మృతి పట్ల సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక చైతన్యం వంటి విలువలను వ్యాప్తి చేయడానికి ఆయన తన జీవితా న్ని అంకితం చేశారని, తద్వారా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన మరణం ఏపీకి, ఆయన బోధనల ద్వారా స్ఫూర్తి పొందిన వారందరికీ తీరని లోటన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు