తొలగింపు కాదు.. సస్పెన్షనే!
ABN , Publish Date - Jul 13 , 2026 | 06:07 AM
అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఓ కీలక బిల్లుపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటరీ సంయుక్త సంఘం(జేపీసీ) ఐదు ప్రధాన మార్పులు సూచించింది...
‘అరెస్టయిన ప్రధాని, సీఎంలపై వేటు’ బిల్లులో జేపీసీ కీలక మార్పులు
శాశ్వత ఉద్వాసన ఉండదు..
30 రోజుల్లో నిర్దోషులుగా విడుదలైతే ఆటోమేటిగ్గా తిరిగి పదవుల్లోకి
పార్లమెంటరీ కమిటీ సిఫారసులు
20 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ, జూలై 12: అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఓ కీలక బిల్లుపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటరీ సంయుక్త సంఘం(జేపీసీ) ఐదు ప్రధాన మార్పులు సూచించింది. తీవ్ర నేరాల ఆరోపణలతో ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు 30 రోజులకుపైగా నిర్బంధంలో ఉంటే.. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకుంటే 31వ రోజు ఆటోమేటిగ్గా వారిపై తొలగింపు వేటు పడుతుందని కేంద్రం తీసుకొచ్చిన బిల్లును గత ఏడాది పార్లమెంటు సమావేశాల్లో విపక్ష ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే ఈ క్రూర బిల్లును తీసుకొచ్చారని ఆరోపించాయి. ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు ఆయా నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన జేపీసీలో భాగమయ్యేందుకు చాలా పార్టీలు నిరాకరించాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని, సీఎంలు, కేంద్ర మంత్రులను శాశ్వతంగా తొలగించడం అనే పదం స్థానంలో.. వారు ‘సస్పెన్షన్’లో ఉంటారన్న పదం చేర్చాలని పార్లమెంటరీ కమిటీ తాజాగా సిఫారసు చేసింది. అంతేగాక.. నిర్దిష్ట 30 రోజుల్లో వారు నిర్దోషులుగా విడుదలైతే.. ప్రాసిక్యూషన్ నిర్దిష్ట గడువులోగా ముందుకెళ్లకుంటే.. వారు ఆటోమేటిగ్గా తిరిగి పదవుల్లోకి వస్తారంటూ మార్చాలని సూచించింది. అలాగే వారిపై వచ్చిన ‘తీవ్ర నేరాభియోగాల’ను నిర్వచించింది. ఐదేళ్లు.. అంతకుపైబడి శిక్షపడే నేరాలుగా పరిగణించాలని పేర్కొంది. అలాగే సస్పెన్షన్‌కు గురయ్యే నేరాలేమిటో నిర్దిష్టంగా పేర్కొనాలని ప్రతిపాదించింది. అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు ఎదుర్కొనే కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు లేదా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని.. సంబంధిత నిందితులు దోషులు కాదని కోర్టులు తేలిస్తే.. పునర్నియమితులవుతారని.. సస్పెన్షన్ శాశ్వతంగా ఉండదన్న సురక్షిత చర్యలు బిల్లులో ఉండాలని సిఫారసు చేసింది. అలాగే ఆయా వ్యక్తులపై వేటు వేయడానికి.. 30 రోజుల కస్టడీకి ప్రత్యామ్నాయంగా ‘అభియోగాల నమోదు దశ’ను కొలమానంగా తీసుకోవాలని ముసాయిదాలో జేపీసీ సూచించింది. ప్రతిపాదిత సవరణలను కేంద్ర హోం శాఖ కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తుంది. క్యాబినెట్ ఆమోదిస్తే లోక్‌సభలో అధికారిక సవరణలను ప్రవేశపెడుతుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఆగస్టు 13 వరకు ఇవి జరుగుతాయి. తాజా సవరణలను ప్రతిపక్షాలు ఆమోదిస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.
ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధం!
నిరవధికంగా నెల రోజులపాటు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులను శాశ్వతంగా తొలగించవచ్చన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని అత్యధికులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిపుణులు, పాలనావేత్తలతో జేపీసీ జరిపిన సంప్రదింపుల్లో.. ఈ నిబంధనను తొలగించాలని సూచించారని జేపీసీ తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. జేపీసీలోని మెజారిటీ సభ్యులు కూడా తాజా మార్పులకు మద్దతిచ్చారు. అయితే కేంద్ర హోం శాఖ సస్పెన్షన్ అనే పదంపై అభ్యంతరం చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. దీంతో సంఖ్యాబలం సాధన దిశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌తో నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెడుతూ హడావుడిగా తీసుకొచ్చిన బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోంది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు