జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు.. సానుకూలంగా ప్రభుత్వ రెండో దఫా చర్చలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:40 PM
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు జార్ఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఓసారి వారితో చర్చలు జరపగా.. తాజాగా శనివారం రెండో దఫా చర్చలు నిర్వహించింది.
రాంచీ: ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు జార్ఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఓసారి వారితో చర్చలు జరపగా.. తాజాగా శనివారం రెండో దఫా చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు సహా పలు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. చర్చల అనంతరం మాట్లాడిన విద్యార్థులు.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నట్లు నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు పేర్కొన్నారు.
కాగా, జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా విద్యార్థులు 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసన దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC-CGL) నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా వారు ఆరోపిస్తున్నారు. 14వ జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్ష పేపర్లతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు లీక్ కావడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నమోదైన పేపర్ లీక్ కేసులపై సీఐడీ విచారణ సక్రమంగా జరగడం లేదని, నామమాత్రంగానే దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా 14వ జేపీఎస్‌సీ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, గత ఏడేళ్లుగా జేపీఎస్‌సీ, జేఎస్ఎస్‌సీ ద్వారా నిర్వహించిన అన్ని నియామక పరీక్షలపై సీబీఐ లేదా ఈడీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. పరీక్షా విధానంలో మరింత పారదర్శకత తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు ఓఎంఆర్ షీట్లలో ఐదో ఆప్షన్‌గా ‘Not Attempted’ అనే ఎంపికను చేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ