Share News

ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు.. ఉద్యమ బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:50 AM

ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారాల తరబడి సాగిన విద్యార్థుల నిరసనలు ముగిశాయని ఊపిరి తీసుకునేలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. 2014 నుంచి ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్సీ) ద్వారా నియమితులైన ఉద్యోగులంతా రోడ్లెక్కారు.

ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు.. ఉద్యమ బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు..
Jharkhand Govt Employees Protest

రాంచీ: ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారాల తరబడి సాగిన విద్యార్థుల నిరసనలు ముగిశాయని ఊపిరి తీసుకునేలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. 2014 నుంచి ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్సీ) ద్వారా నియమితులైన ఉద్యోగులంతా రోడ్లెక్కారు. జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడంపై వారంతా కదం తొక్కారు. రాంచీలోని ప్రాజెక్ట్ భవన్ వద్దకు చేరుకుని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయడంపై మండిపడ్డారు. తమ జీవితాలను రోడ్డున పడేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


విద్యార్థి ఉద్యమ ఒత్తిడి కారణంగానే జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది అమాయక ఉద్యోగులు తక్షణమే ప్రమాదంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలన్న నిర్ణయంతో సుమారు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని తెలిపారు. ఇతరుల తప్పులకు తమను శిక్షించకూడదని చెప్పుకొచ్చారు. పరీక్షల్లో అవకతవకలను పరిష్కరించడానికి పరీక్షను రద్దు చేయడం సరైన మార్గమా? అంటూ ఉద్యోగులు ప్రశ్నించారు. ఈ వివాదంలో ప్రభుత్వం ఒక పక్షం వాదననే విన్నదని.. తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ ద్వారా ఉద్యోగాల్లో చేరామని, మౌఖిక ఉత్తర్వుల ద్వారా తమను తొలగించలేరని తేల్చి చెప్పారు. తామంతా చట్టపరమైన మార్గాల ద్వారా పోరాటం కొనసాగిస్తామని, ఈ విషయంపై అంతిమ నిర్ణయం కోర్టు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.


కాగా, జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఈ ఏడాది జులై 29 నుంచి విద్యార్థులు ఆందోళనలకు దిగారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేదికగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 24 రోజుల పాటు ఆందోళనలు కొనసాగడంతో ప్రభుత్వం తలొగ్గింది. దీంతో జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ సంస్థ ద్వారా నిర్వహించిన పరీక్షలు, చేపట్టిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. అదేవిధంగా ఆయా నియామకాలపై సీఐడీతో పాటు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరాహార దీక్షను విరమించిన ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో..

కరుణానిధిపై వివాదం.. మంత్రి తరఫున క్షమాపణ చెప్పిన సీఎం విజయ్..

Updated Date - Aug 18 , 2026 | 10:56 AM