Share News

కావేరీ నదీ జలాల వివాదం.. కర్ణాటకలో జన నాయగన్ స్క్రీనింగ్‌ నిలిపివేత..

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:42 PM

కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు కర్ణాటకలో చుక్కెదురైంది. సినిమా స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది.

కావేరీ నదీ జలాల వివాదం.. కర్ణాటకలో జన నాయగన్ స్క్రీనింగ్‌ నిలిపివేత..
Vijay Jana Nayagan

ఇంటర్‌నెట్ డెస్క్: కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు కర్ణాటకలో చుక్కెదురైంది. సినిమా స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎమ్ఏ) తమిళనాడుకు నీళ్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లు ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను నిలిపివేశాయి.


ప్రో కన్నడ గ్రూపులు మాండ్య జిల్లాలో నిరసనలు వ్యక్తం చేశాయి. నిరసనకారులు జన నాయగన్ సినిమా పోస్టర్లను చింపేశారు. బెంగళూరులోని సంపిగె థియేటర్ ‘జన నాయగన్’ సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేసింది. అంతేకాదు.. థియేటర్ సిబ్బంది విజయ్‌కి సంబంధించిన కొన్ని పోస్టర్లను తొలగించారు. మరికొన్నిటిని వేరే పోస్టర్లతో కప్పేశారు. తమిళ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పరిస్థితులు చెయ్యిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు.


శ్రీరామ్‌పుర పోలీసులు పెట్రోలింగ్‌ను ఉద్ధృతం చేశారు. సినిమా విడుదలను నిలిపివేయటం వల్ల వచ్చే నష్టంపై చర్చించడానికి ఈ రోజు(శుక్రవారం) కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా ఈ సమావేశాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రదర్శనలు పునఃప్రారంభించడం సాధ్యం కాదని, శాంతిభద్రతలు అదుపులోకి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఛాంబర్ వర్గాలు పేర్కొన్నాయి.


ఇవి కూడా చదవండి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి అదిరిపోయే ఎంట్రీ

ఇలాంటి వారికి కుటుంబ విషయాలు అసలు చెప్పొద్దు

Updated Date - Jul 31 , 2026 | 04:09 PM