ఇలాంటి వారికి కుటుంబ విషయాలు అసలు చెప్పొద్దు
ABN , Publish Date - Jul 31 , 2026 | 02:55 PM
కుటుంబంలో విషయాలను అందరితోనూ పంచుకోవడం మంచిది కాదని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా చాడీలు చెప్పేవారు, అసూయపడేవారు, స్వార్థపరులు, అహంకారులు వంటి వ్యక్తులను కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం మంచిది కాదు. కుటుంబ విషయాలను కొంతమంది వ్యక్తులతో పంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కుటుంబానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాలని ఆచార్య చాణక్యుడు సూచించారు.
ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు సహజం. అలాంటి విషయాలు కుటుంబ సభ్యుల మధ్యే పరిష్కరించుకోవాలి. కుటుంబ గొడవలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను బయటివారితో పంచుకోవద్దు. ముఖ్యంగా ఇలాంటి వారికి కుటుంబ విషయాలు అసలు చెప్పొద్దని చాణక్యుడు సూచించారు.
చాడీలు చెప్పేవారు
కొంతమందికి ఇతరుల విషయాలు ఒకరి దగ్గర నుంచి విని మరొకరికి చెప్పే అలవాటు ఉంటుంది. మీరు మీ ఇంట్లో జరిగే గొడవలు లేదా సమస్యలు వారికి చెబితే, వారు వాటిని వక్రీకరించి ఇతరులకు చెబుతారు. దీంతో మీ కుటుంబ పరువు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అలాంటి వారికి కుటుంబ రహస్యాలు చెప్పకండి.
అసూయపడేవారు
కొంతమంది బయటకు మీ మంచి కోరుకునే వారిలా కనిపించినా, లోపల మాత్రం మీ అభివృద్ధిని చూసి అసూయపడుతుంటారు. అలాంటి వారికి మీ కుటుంబ సమస్యలు చెప్పి సలహా అడిగితే, వారు సరైన మార్గం చూపకుండా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది.
స్వార్థపరులు, దురాశగలవారు
కేవలం తమ లాభం కోసం మాత్రమే మీతో ఉండే వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. వారు తమ ప్రయోజనం కోసం మీ నమ్మకాన్ని ఉపయోగించుకుని, మీ కుటుంబానికి ఇబ్బందులు కలిగించవచ్చు. అందువల్ల వారిని కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచండి.
అహంకారం ఎక్కువగా ఉన్నవారు
తాము చెప్పిందే సరైందని, మిగతావాళ్లంతా తప్పు అని భావించే వ్యక్తులు కుటుంబ సమస్యలను పరిష్కరించరు. పైగా తమ అహంకారంతో చిన్న సమస్యలను కూడా పెద్దవిగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారిని మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు