భారత నౌకల భద్రతపై ఇరాన్‌తో చర్చలు జరిపిన జైశంకర్.. ఎంఈఏ ప్రకటన
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:36 PM
మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారంనాడు తెలిపింది.
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) గురువారంనాడు తెలిపింది. దీనిపై ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందా అనే ప్రశ్నకు, ప్రస్తుతానికి ఇంతవరకే తాను చెప్పగలనని సమాధానమిచ్చారు.
'డాక్టర్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి ఇటీవల మూడుసార్లు సంభాషణలు జరిపారు. చివరిసారిగా భారత నౌకల భద్రత, దేశ ఇంధన భద్రతపై ఉభయులూ చర్చించారు. ఇప్పటికి ఇంతవరకే చెప్పగలను' అని జైశ్వాల్ అన్నారు. ఇరాన్ నుంచి భారతీయుల తరలింపుపై మాట్లాడుతూ, స్వదేశానికి రావాలని కోరుకునే వారికి విదేశాంగ శాఖ హెల్ప్ చేస్తోందన్నారు. స్టూడెంట్లు, నావికులు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్, యాత్రికులతో కలిపి సుమారు 9,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నారని, టెహ్రాన్‌లో ఉంటున్న విద్యార్థులు, యాత్రికులతో సహా పలువురిని అక్కడి సురక్షిత ప్రాంతాలు, నగరాలకు తరలించామని చెప్పారు. అజర్ బైజన్, అర్మేనియా వెళ్లాలనుకుంటున్న భారతీయులను అక్కడకు చేర్చి, అక్కడి నుంచి స్వదేశానికి కమర్షియల్ విమానాల్లో తీసుకు వస్తున్నామని తెలిపారు. ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్‌కు కూడా సహకరిస్తున్నామని చెప్పారు. ఇరాన్ వీడాలని అనుకునే వారు అక్కడి కాన్సులేట్ జారీచేసిన అడ్వయిజరీలను పాటించాలని జైశ్వాల్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
తప్పుడు విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత.. పార్లమెంటు ఆవరణలో రాహుల్ నిరసన
నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కామెంట్స్