నావిక్’ సేవలకు లైన్ క్లియర్..!
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:39 AM
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సేవల పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది
నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం
మూడో దశ కక్ష్య పెంపు విజయవంతం
స్వదేశీ జీపీఎస్ పునరుద్ధరణలో ముందడుగు
న్యూఢిల్లీ, నవంబరు 4: స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సేవల పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహానికి చివరిదైన మూడో దశ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో ఈ ఉపగ్రహం నిర్దేశిత జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరింది. గతనెల 30న ఇస్రో ఎన్‌వీఎస్-03 ప్రయోగించింది. అనంతరం ఈ ఉపగ్రహానికి రెండు సార్లు కక్ష్యం పెంపు కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా మరింత ఎత్తయిన జియో సింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో విదేశీ జీపీఎస్‌కు ప్రత్యామ్నాయమైన స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సేవల పునరుద్ధరణ దిశగా కీలక ముందుడుగు పడినట్టయింది. నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్) అనేది భారత్‌కు చెందిన ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ. ఇది అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) లాంటిదే. నావిక్.. భారత భూభాగంతోపాటు దేశ సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో కచ్చితమైన స్థానం, సమయానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, వాహనాలు, నౌకలు, రైళ్లు, ఇతర పరికరాల్లో నావిగేషన్, ట్రాకింగ్ కోసం నావిక్ సంకేతాలు ఉపయోగపడతాయి. నావిక్ సేవల కోసం నాలుగు ఉపగ్రహాలు అవసరం. అయితే ఈ సేవల కోసం గతంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అణు గడియారాలు విఫలమవడం వల్ల నావిక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఎన్‌వీఎస్-03 ప్రయోగంతో నావిక్ సేవల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..