రాజీనామాలతో ఈసురోమని..
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:06 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవలికాలంలో శాస్త్రజ్ఞుల వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలతో సతమతమవుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం...
ఇస్రోలో కొన్ని నెలల్లో100 మందికి పైగా సైంటిస్టుల రిజైన్లు, వీఆర్‌ఎ్‌సలు
ఇస్రో జీతాలు చాలా తక్కువ
ప్రైవేటులో భారీగా స్పేస్ స్టార్ట్‌పలు
అవి భారీగా జీతాలు ఇస్తుండటంతో ఆకర్షితులవుతున్న శాస్త్రజ్ఞులు
కేంద్రం అప్రమత్తం.. ఇకపై ‘శాస్త్రజ్ఞుల’ రాజీనామాలను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్’కు పంపాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 16: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవలికాలంలో శాస్త్రజ్ఞుల వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలతో సతమతమవుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే 100 నుంచి 120 మంది దాకా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సంస్థ నుంచి నిష్క్రమించారు. వారిలో చాలా మంది గగన్‌యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్-4 వంటి కీలక మిషన్లలో పనిచేస్తున్నవారు కావడం గమనార్హం. సంస్థను వీడినవారిలో దాదాపు 80 మంది.. బెంగళూరులోని ‘యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎ్‌ససీ)’కి చెందినవారు కాగా.. 20 మంది తిరువనంతపురంలోని ‘విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎ్‌సఎ్‌ససీ)’కి చెందినవారు. జీఎ్‌సఎల్‌వీ ఎంకే3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసె్‌ఫ.టి వంటి సీనియర్ సైంటిస్టులు సైతం వీరిలో ఉన్నారు. ఈ వరుస రాజీనామాలు/స్వచ్ఛంద పదవీ విరమణలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. గగన్‌యాన్ తదితర కీలక మిషన్లలో భాగస్వాములైన ‘గ్రూప్ ఏ’ శాస్త్రజ్ఞులు, సాంకేతిక సిబ్బంది ఇచ్చే రాజీనామాలను ఆమోదించవద్దని పేర్కొంటూ జూలై 14న మెమొరాండం జారీచేసినట్టు సమాచారం. అలాంటివారి రాజీనామా, స్వచ్ఛంద పదవీవిరమణ అభ్యర్థనలన్నింటినీ తుది ఆమోదం నిమిత్తం ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్’కు పంపాలని ఆ మెమొరాండంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున శాస్త్రజ్ఞులు సంస్థను వీడి వెళ్లిన విషయాన్ని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ కూడా ధ్రువీకరించారు. ‘‘అవును, చాలా మంది వెళ్తుంటారు. కానీ, ఏ సంస్థలోనైనా అది సహజమే. ఇస్రో చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ చర్య (కేంద్రం ఆదేశాలు). ఇప్పటికి కూడా ఎవరైనా వెళ్తే.. వారి స్థానంలో వేరొకరు బాధ్యతలు తీసుకుంటారు. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక.. కేవలం పరిపాలన కారణాలరీత్యానే ఈ మెమొరాండంను పంపినట్టు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రోలో చాలా మందిసిబ్బంది ఉన్నారని.. చాలామంది వెళ్తుంటారు.. చాలా మంది కొత్తగా చేరుతుంటారని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 14,600 మంది ఉద్యోగులున్న ఇస్రో నుంచి 100-120 మంది నిష్క్రమించడమంటే సంఖ్యపరంగా తక్కువగానే అనిపించవచ్చుగానీ.. వారంతా ఇస్రో చేపట్టిన ప్రతిష్థాత్మకమైన ప్రాజెక్టుల్లో భాగమైనవారు కావడమే ఆందోళన కలిగిస్తున్న అంశం. సంస్థ నుంచి వెళ్లిపోయినవారిలో మరొకరిని నియమించుకోవచ్చుగానీ.. ఎన్నోఏళ్ల వారి అనుభవాన్ని భర్తీ చేయడం మాత్రం సవాలే.

జీతాలు తక్కువ..
ఇస్రోలో జరుగుతున్న ఈ నిష్క్రమణలకు రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి.. తక్కువ జీతాలు. రెండు.. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం. మొదటి కారణం ‘తక్కువ జీతాలు’ విషయానికి వస్తే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తల సగటు వా ర్షిక వేతనం 80 వేల డాలర్ల నుంచి 1.5 లక్షల డాలర్ల దాకా ఉంటుంది. అంటే.. దాదాపుగా రూ.77 లక్షల నుంచి రూ.1.4 కోట్ల దాకా!! అదే ఇస్రోలో సీనియర్ సైంటిస్టుల జీతాలు సైతం.. సగటు సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వేతనాల కన్నా తక్కువగానే ఉంటున్నాయి. దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో సగటు వార్షిక వేతనాలు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలపైగా ఉండగా.. ఇస్రోలో పేస్కేల్స్ వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇస్రో మాజీ చీఫ్ ఎస్.సోమనాథ్, ప్రస్తుత చీఫ్ వి.నారాయణన్ వంటి ‘డిస్టింగ్విష్డ్ సైంటి్‌స్ట’లకు అత్యధికంగా నెలకు రూ.2.24 లక్షల జీతం వస్తుంది. ఇంత తక్కువ జీతాల కారణంగానే చాలా మంది ఐఐటియన్లు ఇస్రోలో చేరడానికి ఇష్టపడట్లేదని.. ఒక శాతం కంటే తక్కువ మందే ఐఐటియన్లు ఇస్రోలో చేరుతున్నారని ఎస్.సోమనాథ్ గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో.. ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ పేరిట ప్రభుత్వం ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో దేశంలో దాదాపు 400 దాకా కొత్త ‘స్పేస్ స్టార్ట్‌ప’లు వచ్చాయి. సీనియర్ శాస్త్రజ్ఞులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. ఆయా ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున, అత్యంత ఆకర్షణీయమైన వేతనాలు ఆఫర్ చేస్తుండడంతోపాటు.. భాగస్వామ్యం కూడా ఇస్తుండడంతో చాలా మంది శాస్త్రవేత్తలు రాజీనామా/స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక