Share News

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:27 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మోదీ పర్యటన సాగింది.

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..
Iran strikes Modi visit timing

ఇంటన్‌నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య గత ఐదు రోజుల నుంచి యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై బాంబు దాడులు చేశాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోగా.. మరుసటి రోజు ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతి దాడులకు దిగింది.


ప్రధాని పర్యటన ముగిసిన రెండు రోజులకు..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మోదీ పర్యటన సాగింది. మోదీ పర్యటన ముగిసిన సరిగ్గా రెండు రోజులకు.. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసింది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించారు.


రూవెన్ అజర్ మాట్లాడుతూ.. ‘అదొక ఆపరేషనల్ అవకాశం మాత్రమే. ప్రధాని మోదీ వెళ్లిపోయిన తర్వాత ఆ అవకాశం వచ్చింది. మోదీ పర్యటన సందర్భంగా ఆయనతో దేశాభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాము. ఈ విషయం గురించి ఆయనతో చర్చించలేదు. దాడులు చేస్తామని ఆ సమయానికి మాకు కూడా తెలీదు. మోదీ వెళ్లిపోయిన తర్వాత ఇరాన్‌పై దాడి చేయాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఇరాన్‌పై దాడులకు ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాతే దాడులు జరిపాము. దాడులకు చాలా కాలం ముందునుంచే మేము అమెరికాతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

రైలు పట్టాల పక్కన కనిపించే బోర్డుల వెనుక ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా?

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులు.. పారదర్శకంగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

Updated Date - Mar 04 , 2026 | 10:41 AM