యుద్ధం విరమిస్తున్నా..
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:48 AM
ఇరాన్‌తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో తాత్కాలిక శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. గురువారం (స్థానిక కాలమానం) ఆయన...
ఇరాన్‌తో ఈ వారాంతంలో శాంతి ఒప్పందం
60 రోజుల సీజ్‌ఫైర్‌కు యూర్‌పలో సంతకాలు
హోర్ముజ్‌ను ఇరాన్ 60 రోజులు తెరుస్తుంది
రెండో దఫాలో ఇరాన్ యురేనియంపై చర్చిస్తాం
భారతీయులున్న నౌకలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్
డీల్ కుదరొచ్చు.. మేమింకా ఆమోదించలే: ఇరాన్
యురేనియం విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్?
చమురు చల్లారె.. బుల్ చిందేసె!
ట్రంప్ ప్రకటనతో 90 డాలర్ల దిగువకు క్రూడ్
కొనుగోళ్ల జోష్‌తో సెన్సెక్స్ 1695 పాయింట్లు అప్
వాషింగ్టన్, జూన్ 12: ఇరాన్‌తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో తాత్కాలిక శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. గురువారం (స్థానిక కాలమానం) ఆయన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వారాంతంలో రెండు దేశాల మధ్య యూర్‌పలో కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఒప్పందంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతకం చేస్తారని వెల్లడించారు. ఆయనతోపాటు అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా వెళ్తారని పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పంద కార్యక్రమం ఏ దేశంలో జరుగుతుందో వెల్లడించలేదు. అలబామాలో జరిగిన టెలీ ర్యాలీలో కూడా ట్రంప్ యుద్ధ విరమణ గురించి మాట్లాడారు. ఇరాన్‌తో మంచి డీల్ కుదిరిందని చెప్పారు. ఒప్పందంపై సంతకాలు చేయగానే హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఇరాన్ తెరుస్తుందని తెలిపారు. 60 రోజులపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని.. అంతకాలం హోర్ముజ్ తెరిచే ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరుగుతాయని వెల్లడించారు. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోనని ఇరాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్‌లో ఇరాన్‌పై విమర్శలు గుప్పించారు. శాంతి ఒప్పంద ముసాయిదా పత్రాన్ని ఇరాన్ నాయకత్వం కుట్రపూరితంగా లీక్ చేసిందని ఆరోపించారు.
ఒప్పందం కుదిరే అవకాశం: ఇరాన్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందించింది. గతంలో మాదిరిగా ఆయన ప్రకటనను కొట్టిపారేయలేదు. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. కానీ, అమెరికా పంపిన ఒప్పంద ముసాయిదాను తాము ఇంకా ఆమోదించలేదని ఐఆర్‌జీసీకి అనుబంధంగా పనిచేసే ఫార్స్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘే కూడా ఇదే విషయం చెప్పారు. శాంతి ఒప్పంద ముసాయిదాలో చాలాభాగం ఎప్పుడో ఖరారైందని తెలిపారు. అయితే, అమెరికా తరచూ అభిప్రాయం మార్చుకుంటుండటంతో ఒప్పందం కుదరటం లేదని పేర్కొన్నారు. ట్రంప్ చెప్పినట్లుగా తాము ఇంకా ముసాయిదాకు ఆమోదం తెలపలేదని చెప్పారు.
ఇరాన్ యురేనియంపై వెనక్కి తగ్గిన ట్రంప్?
యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం మొత్తాన్ని వదులుకోవాల్సిందేనని స్పష్టంచేస్తూ వచ్చిన ట్రంప్.. తాజాగా ఆ అంశంపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. యురేనియంను ఇరాన్‌లోనే ఉంచేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే, దానిని ఐక్యరాజ్య సమితి నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని షరతు పెట్టినట్లు అమెరికా మీడియా పేర్కొంది. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నెలపాటు భీకరంగా యుద్ధం సాగిన తర్వాత ఏప్రిల్ 8న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దాదాపు 2నెలల విరామం అనంతరం ఈ వారంలో ఇరాన్-అమెరికా మళ్లీ భీకర దాడులు చేసుకున్నాయి. అయితే, ఉన్నట్లుండి ఈ దేశాలు శాంతి బాట పట్టడం వెనుక ఖతార్ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి అరాగ్చీతో ఖతార్ రాయబారి అలీ అల్ తవాదీ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. ఈ చర్చల తర్వాతే శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించినట్లు పేర్కొంది. మరోవైపు ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ దేశ ప్రధాని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, లెబనాన్‌లపై దాడుల నిలిపివేత తమ సొంత నిర్ణయమని పేర్కొంది. నిజానికి ఈ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా సమాచారం ఇవ్వలేదని తెలిసింది.
భారత నావికులపై దాడి ఇరాన్ పనే: ట్రంప్
ఒమన్ తీరంలో ఇటీవల భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసింది ఇరాన్ సైన్యమేనని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదనీయం కాదని శుక్రవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. నిజానికి ఈ దాడులకు పాల్పడింది తామేనని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ స్వయంగా ప్రకటించింది. తమ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వెళ్లినందుకే దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడులపై భారత ప్రభుత్వం అమెరికాకు నిరసన కూడా తెలిపింది. ఈ నెల 8న ఒమన్ తీరంలో మారివెక్స్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మొదట దాడి జరిగ్గా, అందులోని 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. 10న సెట్టిబెల్లో అనే మరో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేయటంతో ముగ్గురు భారత నావికులు మరణించారు. గురువారం ఎంటీ జల్‌వీర్ అనే మరో నౌకపై అమెరికా నేవీ దాడి చేసింది.
భారతీయ నావికుల మరణాలపై మోదీ మౌనమేల?
భారత వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు నావికులు మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ముగ్గురు భారతీయులు అంతర్జాతీయ జలాల్లో ప్రాణాలు కోల్పోయినా.. ప్రధాని మోదీ పన్నెత్తు మాట మాట్లాడలేదని.. అమెరికాతో ఆయన రాజీపడ్డారని విమర్శించారు. ‘‘అంతర్జాతీయ జలాల్లోని మూడు రోజుల్లో మూడు భారత వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భరతమాత బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. కానీ.. మన రాజీపడ్డ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భారత ప్రధానిగా ఎవరు ఉన్నా.. విదేశీ శక్తులు హత్యలు చేసినప్పుడు మౌనంగా ఉండరు.’’ అని ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేశారు. ‘‘భరతమాత బిడ్డలను పొట్టనబెట్టుకున్న వారిపై ఆగ్రహించే ధైర్యం గానీ, శక్తికానీ లేని బలహీన ప్రధాని.’’ అని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News