Share News

రూ.3 కోట్ల లంచం కేసు.. ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:32 PM

ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 కోట్ల రూపాయల లంచం కేసులో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

రూ.3 కోట్ల లంచం కేసు.. ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌
Deepak Gehlawat

న్యూఢిల్లీ, జులై 1: ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 కోట్ల రూపాయల లంచం కేసులో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అధికారులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. దీపక్ ఢిల్లీలోని బీసీఏఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నకిలీ మందుల తయారీ రాకేట్ కేసులో ఆయన 3 కోట్ల రూపాయలు లంచం అడిగినట్లు అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీపక్‌ నివాసం, కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.


డిజిటల్‌ పరికరాలు, హార్డ్‌ డిస్క్‌లు, కీలక పత్రాలతో పాటు 90 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందుల తయారీ కేసులో జూన్ 8వ తేదీన సీబీఐ అధికారులు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ సింగ్‌, మధ్యవర్తి రాజ్ కుమార్, వ్యాపారవేత్త ఎన్‌ రాజాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం సింగ్‌, రాజ్‌కుమార్‌‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా దీపక్ పేరు వెలుగులోకి వచ్చింది. తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి నకిలీ మందుల తయారీ కేసు నుంచి బయటకు తీసుకు వస్తానని దీపక్.. ఎన్ రాజాకు మాటిచ్చారు.


ఇందుకోసం 3 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగారు. అదికూడా 1.5 కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించాలని దీపక్ కోరారు. ఏరోసిటీలోని దీపక్ ఆఫీస్‌లో ఈ మేరకు ఓ ఒప్పందం కుదిరింది. దీపక్, ఎన్ రాజాల మధ్య సింగ్ మీడియేటర్‌గా వ్యవహరించాడు. ఎన్ రాజా హవాలా ద్వారా కోటి రూపాయలు సమకూర్చి సింగ్‌కు ఇచ్చాడు. సింగ్ సగం డబ్బులను మరో మీడియేటర్ ప్రభాత్‌కు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు సింగ్‌తో పాటు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌తో దీపక్ గుట్టురట్టయింది.


ఇవి కూడా చదవండి

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

‘మీ పదవి మరికొన్ని నెలలు మాత్రమే’.. సీఎం రేవంత్‌‌పై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

Updated Date - Jul 01 , 2026 | 05:40 PM