Share News

యువకుడి వింత ప్రవర్తన.. విమానం గాల్లో ఉండగా..

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:03 AM

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఎయిర్‌లైన్స్ భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు దెయ్యం పట్టిందని, అందుకే అలా ప్రవర్తించానని చెప్పాడు.

యువకుడి వింత ప్రవర్తన.. విమానం గాల్లో ఉండగా..
IndiGo flight incident

వారణాసి, మార్చి 30: ఓ యువకుడు విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. ఎయిర్‌లైన్స్ భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకోగా.. తనకు దెయ్యం పట్టిందని, అందుకే అలా ప్రవర్తించానని చెప్పాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండిగో సంస్థకు చెందిన 6ఈ-185 విమానం శనివారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో బెంగళూరునుంచి వారణాసి బయలుదేరింది. ఉత్తర ప్రదేశ్‌లోని మావు జిల్లాకు చెందిన మహ్మద్ అద్నాన్ అనే యువకుడు ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు.


విమానం గాల్లోకి లేచిన 15 నిమిషాల తర్వాత మహ్మద్ ఎమర్జెన్సీ డోరును తెరవడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. అలా చేయటం తప్పని, మళ్లీ అలాంటి ప్రయత్నం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. గంటన్నర పాటు అతడు మామూలుగానే ఉన్నాడు. రాత్రి 10.20 గంటల సమయంలో.. అది కూడా విమానం వారణాసిలోని లాల్ బహుదూర్ శాస్త్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో మహ్మద్ మళ్లీ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ విషయంపై పైలట్‌‌ను అప్రమత్తం చేశారు.


పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాడు. మహ్మద్ చర్యల కారణంగా తోటి ప్రయాణీకులు ప్రాణ భయంతో గజగజలాడిపోయారు. 10 నిమిషాల తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌లైన్స్ భద్రతాధికారులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు అతడిని విచారించగా.. ‘నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు తెలియటం లేదు. ఏం జరిగిందో గుర్తేలేదు. నాకు దెయ్యం పట్టింది’ అని చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. గ్యాప్-డౌన్ ఓపెనింగ్

Updated Date - Mar 30 , 2026 | 11:09 AM