జననాల రేటు పతనం
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:10 AM
చైనా, జపాన్, దక్షిణ కొరియాలాగే భారత్ కూడా జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోంది..! దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎ్‌ఫఆర్) చరిత్రలోనే తొలిసారిగా 1.9కి పడిపోయింది....
దేశంలో 1.9కు పడిన రేటు
తొలిసారిగా రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే దిగువకు
తెలంగాణలో ఆందోళనకరం.. రేటు 1.5గా నమోదు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: చైనా, జపాన్, దక్షిణ కొరియాలాగే భారత్ కూడా జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోంది..! దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎ్‌ఫఆర్) చరిత్రలోనే తొలిసారిగా 1.9కి పడిపోయింది. దీర్ఘకాలంలో జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన పునఃస్థాపన స్థాయి (రీప్లే్‌సమెంట్ లెవెల్) 2.1 కంటే దిగువకు పడిపోయింది. ఉత్తరాదిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాకల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ఈ తగ్గుదల భవిష్యత్తులో కార్మికుల కొరతతోపాటు వృద్ధుల జనాభా పెరుగుదలపై ఆందోళన పెంచనుంది. ఈ తగ్గుదల 2000ల నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంది. అప్పట్లో భారత్‌లో జననాల రేటు ఒక్కో మహిళకు 3.3గా ఉండేది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా గత దశాబ్దంలో భారీగా తగ్గింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థిక వేత్త సంజీవ్ సన్యాల్ తెలిపిన గణాంకాల ప్రకారం గత పదేళ్ల కాలంలోనే ఈ రేటు 2.3 నుంచి 1.9కి తగ్గింది. కాగా, జనాభా నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న నిబంధనలను రద్దు చేయాలని, సంతాన నిరోధక శస్త్రచికిత్సలకు ప్రోత్సాహాల చెల్లింపు నిలిపివేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచించింది.
బిహార్‌లో అత్యధికం.. సిక్కింలో అత్యల్పం..
రాష్ట్రాల వారీగా చూసినప్పుడు జననాల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. బిహార్‌లో జననాల రేటు దేశంలోనే అత్యధికంగా 2.9గా నమోదవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (2.6), మధ్యప్రదేశ్ (2.4), రాజస్థాన్ (2.3) ఉన్నాయి. రీప్లే్‌సమెంట్ లెవెల్ 2.1 కంటే ఎక్కువ జననాల రేటు నమోదైంది ఈ రాష్ట్రాల్లోనే. సిక్కింలో అత్యల్పంగా 1.0 టీఎఫ్ఆర్ నమోదవగా, ఢిల్లీలో 1.2, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో 1.3గా ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్‌ల్లో 1.4గా నమోదైంది. తెలంగాణ, కర్ణాటకలో ఇది 1.5గా నమోదైంది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు