Share News

పౌరసత్వానికి పాస్‌పోర్టు రుజువు కాదు!

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:54 AM

ఎవరైనా వ్యక్తికి భారత పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని.. అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది....

పౌరసత్వానికి పాస్‌పోర్టు రుజువు కాదు!

అది కేవలం విదేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమే

  • పాస్‌పోర్టు సేవాదినం సందర్భంగా విదేశాంగ శాఖ ప్రకటన

  • మరి పౌరసత్వ ధ్రువీకరణ ఎలాగనే ప్రశ్నలు

  • కచ్చితమైన పత్రమేదీ లేదంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, జూన్‌ 24: ఎవరైనా వ్యక్తికి భారత పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని.. అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. 14వ పాస్‌పోర్టు సేవాదినం నేపథ్యంలో బుధవారం ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్‌పోర్టు జారీ చేసినప్పటికీ.. అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వెల్లడించింది. నిజానికి ఆధార్‌ గానీ, ఓటర్‌ ఐడీ కార్డుగానీ కేవలం గుర్తింపు పత్రాలే తప్ప.. అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు గతంలోనే స్పష్టం చేశాయి. ఇప్పుడు పాస్‌పోర్టు అంశంలోనూ అదే తరహా ప్రకటనతో.. అసలు భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ధ్రువపత్రాలు ఏమిటనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాస్‌పోర్టు పొందినంత మాత్రాన అది సదరు వ్యక్తికి సంబంధించినది కాదని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు వెనకాల ‘ఇది భారత ప్రభుత్వ ఆస్తి’ అని స్పష్టంగా ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దాన్ని అప్పగించాల్సిందేనని పేర్కొంటున్నాయి. పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి భారతీయ పౌరుడేనని ధ్రువీకరించినట్టు కాదని చెబుతున్నాయి. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఆధార్‌ కార్డు కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని స్పష్టం చేసింది. ఓటరు కార్డు కూడా కేవలం వ్యక్తిగత గుర్తింపు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కును వినియోగించుకునేందుకు మాత్రమే పరిమితమని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి. దీనితో ప్రజల్లో గందరగోళం కనిపిస్తోంది, ఎన్నో సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి.


చట్టం ఏం చెబుతోంది?

భారత పౌరసత్వ చట్టాల ప్రకారం.. దేశంలో 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1వ తేదీ మధ్య జన్మించినవారంతా నేరుగా భారతీయ పౌరులే. ఇక 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్‌ 3వ తేదీ మధ్య భారత్‌లో జన్మించినవారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. 2004 డిసెంబర్‌ 3 తర్వాత జన్మించినవారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారతీయ పౌరులై ఉండాలి. లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉండి, మరొకరు అక్రమ వలసదారు అయి ఉండకూడదు. అలాగైతేనే భారత పౌరసత్వం వస్తుంది. అయితే ఎవరైనా వ్యక్తి భారత పౌరసత్వాన్ని కచ్చితంగా రుజువు చేసే నిర్ణీత పత్రాలేమీ లేవని నిపుణులు చెబుతున్నారు. 1987కు ముందు జన్మించి, సదరు వ్యక్తి పుట్టిన ప్రాంతం, తేదీ-సమయానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఉంటే.. భారత పౌరసత్వానికి ఆధారాలుగా చూపవచ్చని అంటున్నారు. 1987 తర్వాత పుట్టినవారికి సంబంధించి వారి తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు కావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక పౌరసత్వ వివాదాలు, నిర్ధారణలకు సంబంధించి.. కేంద్రం జారీ చేసే ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ సిటిజన్‌షి్‌ప’ పత్రం, పౌరసత్వ చట్టాల కింద జారీ చేసే ధ్రువపత్రాలు వంటివి పౌరసత్వ ధ్రువీకరణకు వీలుకల్పిస్తాయని చెబుతున్నారు. కాగా, దేశంలో పాస్‌పోర్టు సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని, 2025లో 1.39 కోట్ల పాస్‌పోర్టులు జారీ చేశామని విదేశాంగ శాఖ వెల్లడించింది. పోలీసు వెరిఫికేషన్‌ మినహా మిగతా పాస్‌పోర్టు ప్రక్రియ అంతా ఆరు రోజుల్లోనే పూర్తవుతోందని తెలిపింది. దశాబ్దం క్రితం దేశంలో కేవలం 77 పాస్‌పోర్టు కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు 545కు పెరిగాయని వివరించింది.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 06:54 AM