Share News

బరాక్ క్షిపణుల ఆధునికీకరణకు ఇజ్రాయెల్‌తో భారత్ కీలక ఒప్పందం

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:27 PM

భారత నావికాదళానికి చెందిన బరాక్ పాయింట్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ ఆధునికీకరణ కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో రూ.1,976.40 కోట్ల కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

బరాక్ క్షిపణుల ఆధునికీకరణకు ఇజ్రాయెల్‌తో భారత్ కీలక ఒప్పందం

ఢిల్లీ, నవంబర్18: భారత నావికాదళానికి చెందిన బరాక్ పాయింట్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ (Barak Point Defence Missile System) ఆధునికీకరణ కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌(IAI)తో రూ.1,976.40 కోట్ల కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బుధవారం న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుదేశాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. దీంతో భారత నావికాదళ యుద్ధనౌకలపై ఉన్న బరాక్ క్షిపణి వ్యవస్థల్లోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను సమగ్రంగా ఆధునికీకరిస్తారు.


పాత సాంకేతికత స్థానంలో కొత్త విడిభాగాలను అమర్చే అబోలెసెన్స్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను కూడా ఈ ఒప్పందంలో భాగంగా నిర్వహిస్తారు. ఈ అప్‌గ్రేడ్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు, ఇతర గగనతల దాడుల నుంచి భారత యుద్ధ నౌకలకు మరింత బలమైన, ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల రక్షణ సామర్థ్యం లభిస్తుంది. బరాక్ క్షిపణి వ్యవస్థ అనేది యుద్ధ నౌకల పైనుంచి గగనతల ముప్పులను సమర్థవంతంగా అడ్డుకునే ఓ కీలకమైన రక్షణ కవచం. ఈ ఒప్పందంతో నావికాదళ సామర్థ్యం మరింత పటిష్టం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 06:31 PM