Share News

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..

ABN , Publish Date - May 29 , 2026 | 09:41 AM

9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..
Indian Army doctors

ముంబై, మే 29: 9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 9 నెలల చిన్నారి కొద్దిరోజుల క్రితం నేలపై పడి ఉన్న చిన్న ఎల్‌ఈడీ బల్బును మింగింది. ఆ బల్బు చిన్నారి ఎడమ ఊపిరితిత్తిలోకి వెళ్లి ఇరుక్కుంది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పాపను ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిస్ సైన్స్‌కు తీసుకెళ్లారు. ఆర్మీ డాక్టర్లు బ్రోంకోస్కోపీ ద్వారా చిన్నారి ఊపిరితిత్తిలో ఇరుక్కున్న బల్బును విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉంది.


ఈ ఆపరేషన్‌పై సదరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ.. ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘పుణెకు చెందిన ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిస్ సైన్స్‌ (AICTS) నిపుణులు 9 నెలల పసికందు ఎడమ ఊపిరితిత్తి శ్వాసనాళంలో లోతుగా ఇరుక్కుపోయిన ఎల్‌ఈడీ బల్బును విజయవంతంగా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన బ్రోంకోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఆ శిశువు ప్రాణాన్ని కాపాడారు. ఎలాంటి మేజర్ ఆపరేషన్ చేయకుండా బల్బును తొలగించారు’ అని రాసుకొచ్చింది.


ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. సదరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆర్మీ డాక్టర్లకు ధన్యవాదాలు. మీరు నిజంగా దేవుళ్లు’..‘పాపం చిన్నారి ఎంత బాధపడి ఉంటోందో. పాపను కాపాడిన డాక్టర్లకు వందనాలు’..‘ఆర్మీ డాక్టర్లు నిజంగా చాలా గ్రేట్.. ఆ దేవుడు వారిని చల్లగా చూస్తాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

గుండు గీయించుకుని పూజారిగా మారాడు.. కట్ చేస్తే పెద్ద క్రైమ్ లిస్టే బయటపడింది!

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

Updated Date - May 29 , 2026 | 11:13 AM