Share News

భారత్‌-చైనా సైనికుల మధ్య ముఖాముఖి..!

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:23 AM

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఇండోటిబెటిన్‌ బార్డర్‌ పోలీస్(ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌ శత్రుజిత్‌ సింగ్‌ కపూర్‌ వెల్లడించారు.

భారత్‌-చైనా సైనికుల మధ్య ముఖాముఖి..!
india china

  • అరుణాచల్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

  • డ్రోన్లను మోహరించిన ఐటీబీపీ దళాలు

  • ఎల్‌ఏసీ వెంబడి బంకర్ల నిర్మాణం కూడా

  • చైనాతో ముఖాముఖి తలపడే అవకాశం

  • ఐటీబీపీ డైరెక్టర్‌ జనరల్‌ కపూర్‌ వెల్లడి

  • మంచి పరిణామం కాదు: విదేశాంగ శాఖ

  • చర్చలు ఏమయ్యాయి: మోదీకి ఖర్గే ప్రశ్న

  • సరిహద్దు వివాదాలకు చర్చలే

  • పరిష్కారమని చైనా గుర్తించాలి: నరవణే

న్యూఢిల్లీ, అక్టోబరు 23: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఇండోటిబెటిన్‌ బార్డర్‌ పోలీస్(ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌ శత్రుజిత్‌ సింగ్‌ కపూర్‌ వెల్లడించారు. గత కొన్నిరోజులుగా ఇరు దేశాల సైనికుల మధ్య ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో సరిహద్దుల వెంబడి భద్రత, ముందస్తు చర్యలను పటిష్ఠం చేసినట్టు వివరించారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద అవసరమైన చోట బంకర్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, గాల్వాన్‌ వంటి పెద్ద సంఘర్షణలు ఏర్పడినా సమర్థంగా తిప్పికొట్టేందుకు అవసరమైనఅన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో సరికొత్త ప్రతిదాడి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు భారత్‌ అతిపెద్ద శత్రువు చైనాను ఎదుర్కొనేందుకు భూగర్భ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల చివరిలో ఉద్యోగ విరమణ చేయనున్న కపూర్‌ రాజస్థాన్‌లోని అల్వార్‌లో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘గత కొన్ని రోజులుగా సరిహద్దు వెంబడి పరిస్థితి తీవ్రంగా ఉంది.’’ అని పేర్కొన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌-రష్యా, ఇరాన్‌-అమెరికా యద్ధాలను గమనిస్తే డ్రోన్‌లు, యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ ప్రాముఖ్యత అవగతమవుతుందని ఆయన అన్నారు.


దీనివల్లనే ఒక చిన్న దేశం కూడా అతి పెద్ద దేశానికి యుద్ధంలో చుక్కలు చూపించిందన్నారు. చైనా సరిహద్దు ఎంతో సంక్లిష్టమైందని, శక్తివంతమైన పొరుగు దేశమైన చైనా మనకు అతిపెద్ద శత్రువని కపూర్‌ అన్నారు. ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అతిపెద్ద దేశమైన రష్యా నాలుగేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోందని ఈ రోజున నెలకు పది నుంచి 15 వేల మంది సైనికులను కోల్పోతుందని కపూర్‌ గుర్తు చేశారు. అమెరికాతో ఇరాన్‌ కూడా కొన్నాళ్లుగా సమర్థవంతంగా తలపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సంప్రదాయ యుద్ధ తంత్రాలు పోయి డ్రోన్లు తెరపైకి వచ్చాయని కాబట్టి మనం కూడా ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని కపూర్‌ అన్నారు. ఐటీబీపీకి ప్రభుత్వం కేటాయిస్తున్న 400 కోట్ల నిధుల్లో 70 శాతం ఈ డ్రోన్‌ సాంకేతికతను పెంపొందించుకోవడానికే వినియోగిస్తున్నట్లు కపూర్‌ వెల్లడించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా బలగాలతో మన జవాన్లు ముఖాముఖి తలపడే పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయని కపూర్‌ వెల్లడించారు. సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఐటీబీపీకి చెందిన సరికొత్త యుద్ధ దళం శౌర్య కమాండోస్‌ తమ నైపుణ్యాలను చైనాకు చెందిన పీఎల్‌ఏ దళాలకు చూపిస్తున్నాయని కపూర్‌ తెలిపారు. 95 వేల మందికి కఠిన శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అయితే, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు సాధారణ బలగాల మోహరింపులో భాగమేనంటూ కపూర్‌ వ్యాఖ్యలపై చైనా స్పందించింది.


సంబంధాలను దెబ్బతీస్తుంది: భారత్‌

ఎల్‌ఏసీ వెంబడి చైనా దళాలు ‘హద్దులు’ మీరుతున్న పరిస్థితిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇది సరైన విధానం కాదని పేర్కొంది. ఈ పరిణామాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. సరిహద్దుల వెంబడి శాంతి, ప్రశాంతతను కాపాడడం అత్యవసరమని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడారు. ‘‘గతంలో కూడా ఇలానే జరిగింది. చైనా దళాలు తమ నిర్ధారిత గస్తీ ప్రాంతాలను విస్మరించినప్పుడల్లా ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది.’’ అని తెలిపారు. ఇరు పక్షాలు దౌత్య, మిలటరీ ద్వారా సరిహద్దుల వెంబడి ఉన్న అపరిష్కృత అంశాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయని జైస్వాల్‌ వివరించారు.

ఇకనైనా నిజాలు చెప్పండి: ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): చైనాకు క్లీన్‌చిట్‌లు ఇచ్చింది చాలని, ఇకనైనా దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ.. చర్చలు, సమావేశాల పేరుతో ఫొటోలకు ఫోజులివ్వడం మానేసి, వాస్తవాలు వెల్లడించాలన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా బలగాల కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఐటీబీపీ డైరెక్టర్‌ జనరల్‌ ధ్రువీకరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. ‘‘డోక్లాం, గల్వాన్‌ పరిణామాల తర్వాత సరిహద్దుల్లో మరో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంటోందా?’’ అని ప్రశ్నించారు. ఆగస్టులో టాక్సింగ్‌ సమీపంలో చైనా చొరబాట్లు జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన 47రోజుల తర్వాత కూడా, 180 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి కవ్వింపులు కొనసాగుతుండడం సరికాదన్నారు. సరిహద్దుల్లో భారత సైన్యానికి పెట్రోలింగ్‌ చేసుకునే హక్కుల విషయంలో కేంద్రం రాజీ పడిందా? అని నిలదీశారు. అలాగే, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్యంపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖర్గే తప్పుబట్టారు. 2020-21లో గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా చైనా దిగుమతులు ఏకంగా 102ు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ ఎగుమతులను చైనా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆర్థిక మంత్రి స్వయంగా అంగీకరించారని, మరోవైపు చైనా పెట్టుబడులపై ఆంక్షలు సడలించడం, చైనా సంస్థలకు పీఎల్‌ఐ ప్రయోజనాలు కల్పించే యోచనలో ఉండటం దారుణమన్నారు. కేంద్రాన్ని చూస్తుంటే ’మేక్‌ ఇన్‌ ఇండియా‘ పథకం కాస్తా ’ఇంపోర్ట్‌ ఫ్రమ్‌ చైనా‘గా మారిపోయిందా? అని ఎద్దేవా చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం

Updated Date - Oct 24 , 2026 | 05:28 AM