MEA On Lutnick Comments: ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయలేదన్న అమెరికా మంత్రి! భారత విదేశాంగ శాఖ స్పందన
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:02 PM
గతేడాది ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్‌నకు ఫోన్ చేయకపోవడంతో అమెరికాతో డీల్ కుదరలేదంటూ యూఎస్ వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (President Donald Trump) భారత ప్రధాని మోదీ (PM Modi) ఫోన్ చేయకపోవడంతో వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గతేడాది మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని విదేశాంగ శాఖ (Ministry of External Affairs) ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం తెలిపారు.
‘ఆ కామెంట్స్ మా దృష్టికి వచ్చాయి. గతేడాది ఫిబ్రవరి 13 నుంచి భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నాయి. నాటి నుంచీ ఇరు దేశాల బృందాలు పలు మార్లు చర్చలు జరిపాయి. పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఒప్పందంపై చర్చలు తుది వరకూ వెళ్లాయి. అయితే, ఈ చర్చలపై వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం కాదు’ అని రణ్‌ధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో అన్నారు. గతేడాది ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 8 సార్లు మాట్లాడుకున్నారని చెప్పారు. ఇరు దేశాల భాగస్వామ్యానికి సంబంధించి వివిధ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని తెలిపారు.
భారత్, అమెరికా దేశాలకు ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందం కోసం తాము కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాధినేతల మధ్య పరస్పర గౌరవంతో కూడిన స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు.
హొవార్డ్ లుట్నిక్ కామెంట్స్ ఇవీ
ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌నకు కాల్ చేయకపోవడంతో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ పాడ్ కాస్ట్‌లో గురువారం ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘ఒప్పందం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. చివర్లో ప్రధాని మోదీ, ట్రంప్‌నకు కాల్ చేయాల్సి ఉంది. ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. చివరకు ప్రధాని మోదీ కాల్ చేయలేదు’ అని లుట్నిక్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
గుజరాత్‌లో వరుస భూప్రకంపనలతో కలకలం.. ఏకంగా 12 మార్లు..