Gujarat Tremors: గుజరాత్‌లో వరుస భూప్రకంపనలతో కలకలం.. ఏకంగా 12 మార్లు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:55 PM
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో పలుమార్లు భూమి కంపించడం కలకలానికి దారి తీసింది. ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తిప్రాణ నష్టాలు జరగలేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో ఏకంగా 12 మార్లు భూమి కంపించడం కలకలానికి దారి తీసింది. గంటల వ్యవధిలోనే పలుమార్లు భూమి కంపించడంతో ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు చేశారు. రాజ్‌కోట్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి నేటి మధ్యాహ్నం వరకూ పలుమార్లు భూమి కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6-3.8 మధ్య నమోదైంది. ఉప్లేటా, ధొరాజీ, జెత్‌పూర్ తాలూకాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి (Earthquake in Gujarat).
గురువారం రాత్రి 8.42 గంటల ప్రాంతంలో తొలిసారి భూమి కంపించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూకంప కేంద్రం ఉప్లేటా టౌన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో, పరిసరాల్లోని మూడు తాలూకాల్లో ప్రజలు భయకంపితులు అయ్యారు. ఏం జరుగుతోందో అర్థంకాక ఇళ్లల్లోంచి పరుగులు తీశారు. భారీ కట్టడాలు ఏవీ లేని మైదాన ప్రాంతాలకు పరుగు తీశారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పాత భవనాల్లో నిర్వహిస్తున్న స్కూళ్లు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించింది.
ఇలా వరుస పెట్టి స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించడాన్ని స్వార్మ్ టైప్ భూకంపంగా పిలుస్తారని అధికారులు చెబుతున్నారు. భూమి పొరల్లో అప్పటికే ఉన్న చీలికల మధ్యకు నీరు చేరి ఒత్తిడి తీవ్రమైనప్పుడు ఇలా భూమి పలుమార్లు కంపిస్తుందని వివరించారు. స్వార్మ్ టైప్ భూకంపాలు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా తెలిపారు.
ఇవీ చదవండి:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..
సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు