భారత సైన్యానికి ‘జావెలిన్’ భరోసా!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:32 AM
భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఓ కీలక రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి...
శత్రు ట్యాంకులను నాశనం చేసే విధ్వంసక క్షిపణి వ్యవస్థ
అమెరికాతో ప్రతిష్ఠాత్మక రక్షణ ఒప్పందం ఖరారు
భుజంపైనే మోసుకెళ్లి ప్రయోగించే వెసులుబాటు
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’!
న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఓ కీలక రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలుకు అంగీకారం కుదుర్చుకుంది. యూస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రక్రియలో భాగంగా క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ (ఎల్‌వోఏ)పై భారత్ సంతకం చేసింది. అయితే, మొత్తం ఎన్ని క్షిపణులు కొనుగోలు చేస్తున్నారు, దీని ఖర్చు ఎంత.. అనే వివరాలు ఇంకా వెలువరించలేదు. ఒప్పందంతో భారత్- అమెరికా మధ్య రక్షణబంధం మరింత బలోపేతం అయ్యిందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న బలమైన మద్దతుకు ఇది నిదర్శమని అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాడే ఈ జావెలిన్ వ్యవస్థ ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ సాంకేతికతతో పనిచేస్తుంది. అంటే శత్రు లక్ష్యాన్ని ఎంచుకుని క్షిపణి వ్యవస్థ ప్రయోగించిన తర్వాత.. క్షిపణియే స్వయంచాలకంగా టార్గెట్‌ను వేటాడుతుంది. ఈ లోగా సైనికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవచ్చు. యుద్ధ క్షేత్రంలో దాదాపు 65మీటర్ల దూరం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను, సాయుధ వాహనాలను సులభంగా ధ్వంసం చేస్తుంది. ఇది ఒకే వ్యక్తి సులభంగా భుజంపై మోసుకెళ్లగలిగే తేలికపాటి ఆయుధం. బిల్డింగ్ లేదా బంకర్ల లోపలి నుంచి కూడా శత్రువులపై ప్రయోగించవచ్చు. జావెలిన్ క్షిపణి గాల్లోకి లేచి, రివర్స్ ‘యూ’ ఆకారంలో ప్రయాణించి నేరుగా యుద్ధ ట్యాంకుల పైభాగాన్నే (కానోపీ) కచ్చితత్వంతో తాకి ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణ దిగ్గజాలు రేథియాన్, లాక్‌హిడ్ మార్టీన్ అనే సంస్థలు అభివృద్ధి చేశాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు ఈ ఆయుఽధాలతోనే రష్యా సైనిక వాహనాలను మట్టికరిపించాయి. వీటి ఉధృతి నుంచి తప్పించుకోవడానికి రష్యా సైన్యం తమ ట్యాంకులపై ఏకంగా ఇనుప బోన్లను అమర్చుకుంది. ఉక్రెయిన్ రక్షణ పోరాటంలో ‘గేమ్ ఛేంజర్’గా నిలిచిన ఈ సాంకేతికత, ఇప్పుడు భారత్‌కు లభించడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు