Share News

అమెరికా ఉత్పత్తులపై..భారత్‌లో సున్నా టారిఫ్‌!

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:44 AM

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైనా భారత్‌ సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.

అమెరికా ఉత్పత్తులపై..భారత్‌లో సున్నా టారిఫ్‌!

  • అమెరికా నుంచి 45 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామని మోదీ మాటిచ్చారు

  • భారత్‌పై మాత్రం 18ు టారిఫ్ అమలు

  • వైట్‌హౌస్‌ ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌,అమెరికా వాణిజ్యశాఖ ప్రతినిధి గ్రీర్‌ వెల్లడి

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, ఫిబ్రవరి 4: అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైనా భారత్‌ సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు. అదే సమయంలో భారత ఉత్పత్తులపై అమెరికా 18శాతం సుంకాలు వసూలు చేస్తుందని, భారత్‌తో వాణిజ్య లోటు భారీగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని.. అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతామని భారత్‌ హామీ ఇచ్చిందని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె వైట్‌హౌజ్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్‌ నేరుగా చర్చించి.. వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి వచ్చారు. అమెరికాలో రవాణా, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం రూ.45 లక్షల కోట్లు(500 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెడతామని ప్రధాని మోదీ మాటిచ్చారు’’ అని కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు. ఇక పండ్లు, కూరగాయలు వంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో పాటూ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జేమీసన్‌ గ్రీర్‌ కూడా పేర్కొన్నారు. కొన్ని రకాల వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మాత్రం భారత్‌ రక్షణ సుంకాలు విధించుకునేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. ‘‘భారత్‌ ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5ు సుంకాలు వసూలు చేస్తోంది. ఇకపై ఇవి సున్నాకు తగ్గిపోతాయి. అవేకాదు ఆల్కహాల్‌, పండ్లు, కూరగాయలు సహా 98ు ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు తగ్గిపోతాయి’’ అన్నారు. అయితే, అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భారత వ్యవసాయం, ఇతర కీలక, సున్నిత రంగాలకు రక్షణలు ఉంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్‌ మఽధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు ప్రాజెక్టుపై భారత్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రతి బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించే కేంద్రం ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపలేదు.


భారత్‌ ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా

భారత్‌కు రష్యా ఒక్కటే చమురు సరఫరా చేయడం లేదని, ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తుందని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ ఇచ్చిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ఆయన ఈ విధంగా స్పందించారు. ఏ దేశం నుంచి అయినా చమురు కొనుగోలు చేసుకునే హక్కు భారత్‌కు ఉందని, ఇందులో కొత్తేమీ లేదని పెస్కోవ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Feb 05 , 2026 | 06:59 AM