Share News

‘అంతరిక్షం’లో అగ్రస్థానానికి ఎదుగుదాం!

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:52 AM

అంతరిక్ష రంగంలో ప్రైవేటు స్పేస్‌ స్టార్ట్‌పలకు అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేటు రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను...

‘అంతరిక్షం’లో అగ్రస్థానానికి ఎదుగుదాం!

స్పేస్‌ స్టార్ట్‌పలకు అన్నివిధాలా అండ: మోదీ

  • 20 స్పేస్‌ స్టార్ట్‌పల సీఈవోలతో భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అంతరిక్ష రంగంలో ప్రైవేటు స్పేస్‌ స్టార్ట్‌పలకు అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేటు రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాలని సూచించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలంటే.. భారత్‌కు వెళ్లాలనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. 20 స్పేస్‌ స్టార్టప్‌ కంపెనీల సీఈవోలు, వ్యవస్థాపకులతో మోదీ తాజాగా సమావేశమయ్యారు. భారత అంతరిక్ష పరిశ్రమలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించిన తర్వాత ఒక సానుకూల దృక్పథం కనిపిస్తోందని, అమెరికా, యూర్‌పలో నివసించే అనేక మంది భారతీయులు తిరిగి భారత్‌ వచ్చి, ఇక్కడే పనిచేయాలని అనుకుంటున్నారని ఓ సీఈవో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మీ వల్లనే ప్రతిభావంతులను ఒక ఆయస్కాంతంగా అకర్షించగలమని, ఇదే మనకు గొప్ప బలంగా మారుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాని స్టార్ట్‌పల ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో ధైర్యంగా కొత్త రంగంలోకి ప్రవేశించిన ఈ సీఈవోలను ఈ సందర్భంగా ప్రశంసించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ భారత మొట్టమొదటి ప్రైవేటు రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని సీఈవోలు తెలిపారు. 2027మధ్య నాటికి నెలకు ఒక ప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. స్కైరూట్‌ విజయం తర్వాత పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈ సమావేశంలతో స్కైరూట్‌ ఏరోస్పేస్‌, అగ్నికుల్‌ కాస్మోస్‌, పిక్సెల్‌, ధ్రువ స్పేస్‌ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ‘గొప్పగా కలలు కనడం, మరింతగా ఆవిష్కరణలు చేయడం, సరికొత్త సరిహద్దులను అధిగమించడం వైపు సాగుదాం.’ అని ఆయన అన్నారు.


నాలుగు నెలల్లో ‘గగన్‌యాన్‌’

  • మొదటి మానవ రహిత ప్రయోగం

  • ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ వెల్లడి

గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ కీలక ప్రకటన చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మూడో నేషనల్‌ స్పేస్‌ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రానున్న నాలుగు నెలల్లో గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మొదటి మానవ రహిత (అన్‌-క్రూడ్‌) ప్రయోగాన్ని నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోందని నారాయణన్‌ పేర్కొన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 8వేల టెస్టులు పూర్తయ్యాయని తెలిపారు. మూడు మానవ రహిత ప్రయోగాల తర్వాత మానవ సహిత గగన్‌యాన్‌ మిషన్‌ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 12 ఉపగ్రహాలను సిద్ధం చేయాలని, అలాగే ఎనిమిది లాంచ్‌ వెహికల్‌ మిషన్లను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇటీవల స్కైరూట్‌ ఏరోస్పేస్‌ విజయవంతంగా చేపట్టిన ‘విక్రమ్‌-1’ రాకెట్‌ ప్రయోగాన్ని నారాయణన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతరిక్ష రంగంలో భారత ప్రైవేటు సంస్థలకు ఇది ఒక మైలురాయి వంటిదని అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 07:07 AM