'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక రాతలపై భారత్ తీవ్ర అభ్యంతరం
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:06 AM
అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' కథనంలో ఉపయోగించిన శీర్షికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాన్ని 'పాకిస్థానీ కశ్మీర్' అని అభివర్ణించడం తప్పుదోవ పట్టించేలా, అసత్యంగా ఉందని పేర్కొంది.
వాషింగ్టన్ డీసీ, జులై 30: అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' (The New York Times) కథనంలో ఉపయోగించిన శీర్షికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాన్ని 'పాకిస్థానీ కశ్మీర్' (Pakistani Kashmir) అని అభివర్ణించడం తప్పుదోవ పట్టించేలా, అసత్యంగా ఉందని స్పష్టం చేసింది.
ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా స్పందిస్తూ 'పాకిస్థానీ కశ్మీర్ అనేదే లేదు, ఉన్నదల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే' అని తేల్చిచెప్పింది. 'జమ్మూ-కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలే. ఆ ప్రాంతాల్లోని కొన్ని భాగాలను పాకిస్థాన్ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా, అక్కడ ఆక్రమణకు గురైన ప్రజలపై నిరంతరం హింసకు పాల్పడుతోంది' అని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, అక్కడ చోటుచేసుకున్న అలజడులపై న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' అనే పౌర హక్కుల సంస్థ సభ్యులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని ఆ పత్రిక పేర్కొంది.
వారం రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఎన్నికల ప్రక్రియ దెబ్బతిన్నదని, తమ సభ్యులు పలువురు పోలీసుల కాల్పుల్లో మరణించారని 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' ఆరోపించినట్లు న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. అలాగే, ఈ మరణాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని 'హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్' డిమాండ్ చేసిందని తెలిపింది.
అయితే, ఈ కథనానికి న్యూయార్క్ టైమ్స్ పెట్టిన శీర్షిక ప్రాంతీయ వాస్తవాలను వక్రీకరించేలా ఉందంటూ భారత్ దౌత్యపరమైన హెచ్చరిక చేసింది. మొత్తం జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రాంతాలపై భారతదేశానికి పూర్తి సార్వభౌమాధికారం ఉందని, ఆ భూభాగాలు భారత్‌లో అవిభాజ్య భాగాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్