Share News

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:33 AM

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌కు భారత అధికారులు షాక్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌, ఇతర భద్రతా ఏర్పాట్లను తొలగించారు.

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..
India Pakistan Diplomatic Tensions

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌కు భారత అధికారులు షాక్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌, ఇతర భద్రతా ఏర్పాట్లను తొలగించారు. పాకిస్థాన్‌ హైకమిషన్‌ వెలుపల అనుమతి ఇచ్చిన పరిధికి బయట కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీసా విభాగం సమీపంలోని క్యూలైన్‌ ఏర్పాట్లు, బారికేడ్లను జేసీబీ సాయంతో తొలగించారు.


ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ వెలుపల పాక్ ఇలాంటి చర్యలకే పాల్పడింది. ఆ ఘటన జరిగిన మూడు రోజులకే భారత్‌ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో దీనిని ‘టిట్‌ ఫర్‌ టాట్‌’గా పలువురు భావిస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద నిర్మాణాల తొలగింపును ఇస్లామాబాద్‌లోని పరిణామాలకు ప్రతీకారంగా చేసినట్లు కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఇరుదేశాలు దౌత్య కార్యాలయాల చుట్టూ భద్రతా ఏర్పాట్లను తొలగించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.


ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో ఇటీవల పర్యటించిన అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు ఆగ్రహం తెప్పించాయి. భారత్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమైన భాగమని ఆయన అనడంతో పాటు, కశ్మీర్‌ లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. అమెరికా ప్రయాణ హెచ్చరికలను పునఃపరిశీలించే అవకాశం ఉందనీ సంకేతాలిచ్చారు. అమెరికా రాయబారి వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్‌లోని అమెరికా ఛార్జ్‌ డి’అఫైర్స్‌ నాటలీ బేకర్‌ను పాక్‌ విదేశాంగ శాఖ పిలిపించుకుని నిరసన తెలిపింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై తమ వైఖరిని పాకిస్థాన్‌ మరోసారి స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..

ఉత్తర కెన్యాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి..

Updated Date - Aug 20 , 2026 | 11:39 AM