దేశంలోని మొత్తం జనాభా 147.66 కోట్లు
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:53 AM
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతోంది.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 20: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతోంది. దేశ జనాభా 147.66 కోట్లకు చేరిందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) అంచనా వేసింది. ఈ సంస్థ గురువారం విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2026’ ప్రకారం... భారతీయుల్లో నాలుగో వంతుకు పైగా (26శాతం) 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతే ఉన్నారు. దీనిని భారతదేశపు ‘యువ దశ’గా ఈ నివేదిక అభివర్ణించింది. దేశంలోని అపారమైన యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు యువత ఆశయాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన ఆరోగ్య సేవలపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించింది. 2025లో భారత జనాభా 146 కోట్లు ఉండగా, అంతకుముందు ఏడాది 144 కోట్లుగా నమోదైంది. వచ్చే 40 ఏళ్లలో దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో 14 ఏళ్ల లోపు వయసు వారు 24శాతం మంది, 10 నుంచి 19 ఏళ్ల వయసు కలవారు 17శాతం, 15 నుంచి 64 ఏళ్ల వయసు వారు 69శాతం, 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారు 8శాతం మంది ఉన్నారు. చైనా జనాభా సుమారు 141.29 కోట్లు కాగా, వీరిలో 70శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల వయసువారు.
ఇవి కూడా చదవండి..
ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..