Share News

10 ఏళ్ల జైలు.. రూ.10 కోట్ల జరిమానా!

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:13 AM

పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న ‘పబ్లిక్‌ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం-2024’ను....

10 ఏళ్ల జైలు.. రూ.10 కోట్ల జరిమానా!

  • ప్రశ్నపత్రాల లీకేజీ దోషులపై కఠిన చర్యలు

  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి, శిక్షలు విధించేలా ప్రతిపాదనలు

  • ప్రస్తుత చట్టంలో సవరణలకు నిర్ణయం

  • ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం!

  • రీల్స్‌ చేయండి.. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండండి

  • యువతకు బాగా దగ్గరవ్వండి

  • కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ, జూలై 24: పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న ‘పబ్లిక్‌ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం-2024’ను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం.. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇక, పేపర్‌ లీకులపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో తొలి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటవగా.. మరో నాలుగింటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాల పరిధిలో లీకులకు సంబంధించిన కేసుల విచారణను మూడు నెలల్లో పూర్తిచేసి దోషులకు శిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సోమవారమే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


ఇన్‌స్టాలో యువతతో మమేకం అవ్వండి..

సోషల్‌ మీడియాలో మరింత సమర్థంగా కొనసాగాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియాశీలంగా ఉండాలన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంత మంది యాక్టివ్‌గా వినియోగిస్తున్నారంటూ క్యాబినెట్‌ భేటీలో మోదీ మంత్రులను ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రతి మంత్రీ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పోస్ట్‌ చేయడమేగాక.. యువతతో మమేకం అయ్యే సమాచారాన్ని కూడా పోస్ట్‌ చేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే రీల్స్‌ చేయడంతో పాటు ఇతర వీడియోలు కూడా పోస్ట్‌ చేసి యువతకు మరింత చేరువ కావాలని మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. యువత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఉంటోందని మోదీ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 06:13 AM