ఏఐ నియంత్రణకు చట్టం?
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:03 AM
కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు తమకు విధించిన నియంత్రణలను, మార్గదర్శకాలను ఉల్లంఘించి, రహస్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు
త్వరలో ‘ఏఐ’పై సంప్రదింపుల పత్రం
ప్రజలు, నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తాం
మనుషుల నియంత్రణలోనే ఏఐ ఉండాలి
రెండేళ్లలో భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 23: కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు తమకు విధించిన నియంత్రణలను, మార్గదర్శకాలను ఉల్లంఘించి, రహస్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ అభివృద్ధిని, వాటి పరిధిని నియంత్రించేందుకు ప్రభుత్వాలే నిబంధనలు విధించాలని, పకడ్బందీగా చట్టాలను చేయాలని కృత్రిమ మేధ సంస్థల అధినేతలే స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐపై నియంత్రణల దిశగా భారత్ అడుగులు వేస్తోందా? ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తోందా? ఇందుకోసమే నిపుణులు, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించిన అంశాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే ప్రమాదాలపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఏఐపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసి నిపుణులు, పౌరులు, కంపెనీలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్- 2026లో తెలిపారు.
ప్రస్తుతం దేశంలో వివిధ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, అదే సమయంలో మానవ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికత ఎల్లప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలన్నారు. ఇదే వేదికపై భారత మొబైల్ ఫోన్ల తయారీ రంగం భవిష్యత్తుపైనా అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో ఆపిల్, శాంసంగ్ వంటి భారత్ తన సొంత బ్రాండ్‌తో, దేశీయంగా డిజైన్ చేసి తయారుచేసిన మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!
మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం