Share News

భారత్‌-జపాన్‌ ఏఐ బంధం

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:46 AM

భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేడు ప్రపంచాన్ని శాశిస్తున్న కృత్రిమ మేధ(ఏఐ)పై కలసి కృషి చేయాలని నిర్ణయించాయి.భారత్‌ సాఫ్ట్‌వేర్‌, ఏఐ నైపుణ్యాలకు...

భారత్‌-జపాన్‌ ఏఐ బంధం

ఆర్థిక, రక్షణ రంగాల్లో సంయుక్త కృషి

16వ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయం

తొలిసారిగా రక్షణ భాగస్వామ్య డీల్‌

రూ.5.92 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 2: భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేడు ప్రపంచాన్ని శాశిస్తున్న కృత్రిమ మేధ(ఏఐ)పై కలసి కృషి చేయాలని నిర్ణయించాయి.భారత్‌ సాఫ్ట్‌వేర్‌, ఏఐ నైపుణ్యాలకు, జపాన్‌ తయారీ సామర్థ్యాలు తోడై ఫలితాలు సాధించాలన్న అవగాహన కుదిరింది. అంతేకాదు, ఆర్థిక, రక్షణ, ఇంధనం సహా పలు కీలక రంగాల్లో విస్తృత సహకారానికి రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో జపాన్‌ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, కీలక ఖనిజాలు, వ్యూహాత్మక తయారీకి సంబంధించి సరఫరా వ్యవస్థల బలోపేతానికి కలసి పనిచేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన సహకార, అవగాహ న ఒప్పందాలు ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని సనాయే తకాయిచి సమక్షంలో కుదిరాయి. గురువారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో నిర్వహించిన భారత్‌-జపాన్‌ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జపాన్‌ ప్రధాని తకాయిచితో కలసి ప్రధాని మోదీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రత ప్రాముఖ్యాన్ని భారత్‌, జపాన్‌ పూర్తిగా అర్థం చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక భద్రతకు సంబంధించి సంయక్త కార్యాచరణను సిద్ధం చేశాం’’అని ప్రధాని ప్రకటించారు. గడిచిన ఏడాది కాలంలో భారత్‌-జపాన్‌ మధ్య కుదిరిన 100కు పైగా ఒప్పందాలతో 10 బిలియన్‌ డాలర్ల (రూ.95వేల కోట్లు) జపాన్‌ పెట్టుబడులు భారత్‌కు రానున్నట్టు ప్రకటించారు. వచ్చే పదేళ్లలో 10 ట్రిలియన్‌ జపాన్‌ యెన్‌ల పెట్టుబడులను (రూ.5.92 లక్షల కోట్లు సుమారు) ఆకర్షించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇదే కాలంలో భారత్‌లో కార్యకలాపాలు అందించే జపాన్‌ కంపెనీలను రెట్టింపు చేస్తామన్నారు. సాంస్కృతిక విలువల నుంచి ఆధునిక సాంకేతికతల వరకు భారత్‌ జపాన్‌ మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నట్టు చెప్పారు. కాగా, భారత్‌-జపాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా.. సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.


నా చిట్టి చెల్లెమ్మ..

‘జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి నా అందమైన చిట్టి చెల్లెమ్మ’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మాట విన్న వెంటనే తకాయిచి సహా సదస్సుకు హాజరైన వారందరి ముఖాలు చిరునవ్వులతో నిండిపోయాయి.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 06:31 AM