రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కొత్త టెక్నాలజీ..
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:09 PM
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే వీ2వీ (V2V), సీ-వీ2ఎక్స్ (C-V2X) వ్యవస్థల అమలుకు ముసాయిదా విడుదల చేసింది.
ఢిల్లీ: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల మధ్య నేరుగా సమాచార మార్పిడి జరిగే వీ2వీ (V2V - Vehicle to Vehicle) సాంకేతికతను అమలు చేసేందుకు కేంద్ర రహదారి రవాణా శాఖ (MoRTH) కొత్త ముసాయిదాను విడుదల చేసింది.
ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి సమాచారం పంచుకుంటాయి. రోడ్డుపై ఎదురుగా ప్రమాదం, అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, వాహనం వేగం తగ్గడం వంటి పరిస్థితులపై ముందుగానే హెచ్చరికలు అందుతాయి. దీంతో డ్రైవర్లు అప్రమత్తమై ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
ADAS కంటే మరింత ఆధునిక సాంకేతికత
ప్రస్తుతం కొన్ని వాహనాల్లో ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కెమెరాలు, సెన్సార్ల ఆధారంగా పనిచేస్తుంది. అయితే కొత్తగా తీసుకురానున్న సీ-వీ2ఎక్స్ (C-V2X - Cellular Vehicle-to-Everything) సాంకేతికత వాహనాలు, రోడ్డు మౌలిక సదుపాయాలు, ఇతర వాహనాలతో నేరుగా కమ్యూనికేట్ చేసేలా రూపొందించనుంది. దీంతో డ్రైవర్‌కు కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తించి హెచ్చరికలు అందించే అవకాశం ఉంటుంది.
లైసెన్స్ రహిత ఫ్రీక్వెన్సీ కేటాయింపు
ఈ సాంకేతికత కోసం 5.875 GHz నుంచి 5.925 GHz వరకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను లైసెన్స్ రహితంగా కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల వాహనాల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి సాధ్యమవుతుంది. ఈ కొత్త వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం 2027 అక్టోబర్ నుంచి దశలవారీగా అమల్లోకి తీసుకురానుంది.
Also Read:
రియాలిటీ షోలో మెరిసిన టీమిండియా బౌలింగ్ కోచ్.. వీడియో వైరల్
పూజ గది శుభ్రం చేసే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి