దేశంలో కోటి దాటిన హెచ్‌పీవీ టీకా డోసులు
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:50 AM
మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కోటికి పైగా టీకా డోసులను పంపిణీ చేశారు.
ఏపీలో 100 శాతం.. తెలంగాణలో 95 శాతం కవరేజీ: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ, నవంబరు 21: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కోటికి పైగా టీకా డోసులను పంపిణీ చేశారు. తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
భారత రిజిస్ర్టార్ జనరల్ 2021 జనాభా అంచనాల ఆధారంగా గుర్తించిన 14 ఏళ్ల వయస్సు గల 1.2 కోట్ల బాలికల వార్షిక లక్ష్యంలో దాదాపు 87 శాతం మందికి టీకాలు అందించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మధ్యప్రదేశ్, బిహార్ 100 శాతం కవరేజీని సాధించాయి. తెలంగాణలో 95.28 శాతం మందికి హెపీవీ టీకాలు వేశారు.