Share News

దేశంలో ఇంధన కొరత లేదు.. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి

ABN , Publish Date - May 12 , 2026 | 02:18 PM

దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి సమస్య లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.

దేశంలో ఇంధన కొరత లేదు.. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి
Hardeep Singh Puri

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి సమస్య లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) అన్నారు. సీఐఐ వార్షిక వాణిజ్య సదస్సులో మంగళవారంనాడు ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ప్రస్తుతం 69 రోజులకు సరిపడా క్రూడాయిల్, ఎల్ఎన్‌జీ నిల్వలు, 45 రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు.


పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా, నిరంతరాయ సరఫరాకు వీలుగా ప్రభుత్వం ఎల్‌పీజీ ఉత్పత్తిని రోజుకు 35,000-36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచిందని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. సంక్షోభాన్ని బాధ్యతాయుతంగా ఎదుర్కొంటున్నామని, ఎక్కడా ఎలాంటి డ్రై-ఔట్లు లేవని చెప్పారు. ఇంధన సరఫరా గొలుసు స్థిరంగా ఉందని స్పష్టం చేశారు.


పశ్చిమాసియా సంక్షోభం నుంచి ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తగిన సూచనలు చేసిన్టటు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి గత ఆదివారంనాడు హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నిర్వహించిన సదస్సులో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, సిటీల్లో మెట్రో రైల్ సేవలు, కార్‌పూలింగ్ సేవలను ఉపయోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, పార్సిల్స్ కోసం రైల్వే సేవలు వినియోగించుకోవాలని, వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు .. త్వరలో కొత్త షెడ్యూల్

Updated Date - May 12 , 2026 | 02:41 PM