Share News

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:56 PM

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్ అక్రమంగా ప్రసారం అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేసింది.

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..
Telegram

న్యూఢిల్లీ: సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్ అక్రమంగా ప్రసారం అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేసింది. పెద్దఎత్తున పైరేటెడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు పంపిణీ అవుతున్నాయన్న ఆరోపణలతో టెలిగ్రామ్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే చేపట్టిన చర్యలపై 15 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని ఆజ్ఞాపించింది. పలు ఓటీటీ సంస్థలు, సినీ నిర్మాతలు, కాపీరైట్ హక్కుల యజమానులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది.


ఈ మేరకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కంటెంట్‌ను 3,142 టెలిగ్రామ్ ఛానళ్లు అనుమతి లేకుండా పంపిణీ చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. ఈ నోటీసును సమాచార సాంకేతిక చట్టం-2000 కింద జారీ చేసినట్లు పేర్కొంది. ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్-2021 ప్రకారం ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అక్రమ కంటెంట్‌ను తొలగించడం ఆన్‌లైన్ మధ్యవర్తి సంస్థల బాధ్యతని స్పష్టం చేసింది. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని టెలిగ్రామ్‌కు సూచించింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరేటెడ్ కాపీలు టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రత్యక్షం అవుతుండటంతో నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, పంపిణీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం పేర్కొంది. భారత క్రియేటర్ ఎకానమీని కాపాడటంతో పాటు సినీ పరిశ్రమ, ప్రసార సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల హక్కులను రక్షించడమే ఈ చర్యల లక్ష్యమని కేంద్రం తెలిపింది.


ఇదిలా ఉండగా, మెసేజింగ్ యాప్‌లలో ప్రవేశపెడుతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పైనా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? మోసాలు, నకిలీ గుర్తింపులు, వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (MeitY) నోటీసులు పంపింది. కాగా, కొన్ని రోజుల క్రితమే ఇలాంటి నోటీసులు వాట్సాప్‌కూ జారీ చేసింది.


ఇవీ చదవండి:

'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

Updated Date - Jul 04 , 2026 | 02:54 PM