Share News

చాబహార్‌ పోర్టు నుంచి భారత్‌ ఔట్‌?

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:43 AM

పర్షియన్‌ గల్ఫ్‌ ముఖద్వారం వద్ద ఉన్న కీలకమైన ఇరాన్‌ చాబహార్‌ పోర్టులో భారత్‌ భాగస్వామ్యం వదిలేసుకుంటోందన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా ఆంక్షల మినహాయింపు...

చాబహార్‌ పోర్టు నుంచి భారత్‌ ఔట్‌?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: పర్షియన్‌ గల్ఫ్‌ ముఖద్వారం వద్ద ఉన్న కీలకమైన ఇరాన్‌ చాబహార్‌ పోర్టులో భారత్‌ భాగస్వామ్యం వదిలేసుకుంటోందన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగుస్తుండటం, ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న క్రమంలో మినహాయింపు పొడిగించే అవకాశం కనిపించకపోవడంతో.. భారత్‌ ఈ నిర్ణయం తీసుకుందంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. పశ్చిమాసియాతో భారత్‌ వాణిజ్యాన్ని సులభతరం చేయడం, పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వదార్‌ పోర్టుకు పోటీగా, అదే ప్రాంతంలో భారత్‌కు పట్టున్న పోర్టు ఉండాలన్న ఉద్దేశంతో.. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టును భారత్‌ అభివృద్ధి చేసింది. ‘ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ చబహార్‌ ఫ్రీజోన్‌’ పేరిట చేపట్టి ఈ ప్రాజెక్టులో ‘భారత పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌’కు మెజారిటీ వాటా ఉంది. అయితే ఇరాన్‌ అణు కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశంపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కానీ భారత్‌ అమెరికాపై ఒత్తిడి తెచ్చి.. 2018లో చాబహార్‌ పోర్టు అభివృద్ధి, నిర్వహణ కోసం ఆంక్షల నుంచి మినహాయింపు సంపాదించింది. ఆ గడువు ఈ నెల 26వ తేదీతో ముగుస్తోంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఈ గడువును అమెరికా పొడిగించబోదని భారత్‌ భావిస్తోంది. చాబహార్‌ పోర్టులోని వాటాలను ఇరాన్‌ స్థానిక సంస్థకు ‘భారత్‌ పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌’ విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అమెరికా ఆంక్షల వర్తింపు మొదలవగానే పోర్టు నిర్వహణను ఇరాన్‌ సంస్థ చూసుకునేలా, ఆంక్షల రద్దు/మినహాయింపు వచ్చాక తిరిగి భారత్‌కు అప్పగించే దిశగా మధ్యంతర ఒప్పందం కుదుర్చుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:43 AM