Share News

సీఈసీపై ఇండియా కూటమి సమరం.. నేడు ‘జన మహాభియోగ్’

ABN , Publish Date - Oct 30 , 2026 | 08:11 AM

దేశంలో ఓటర్ల జాబితాల నుంచి భారీగా పేర్లు తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి పోరుకు సిద్ధమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని నేడు ‘జన మహాభియోగ్’ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది.

సీఈసీపై ఇండియా కూటమి సమరం.. నేడు ‘జన మహాభియోగ్’
Election Commission of India

ఢిల్లీ, అక్టోబర్ 30: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి నేడు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. ‘మాక్ పార్లమెంట్’గా తొలుత ప్రచారంలోకి వచ్చిన ఈ కార్యక్రమానికి తాజాగా ‘జన మహాభియోగ్’ గా పేరు మార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రతిపక్ష నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఓటుహక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రత వంటి అంశాలపై తమ అభిప్రాయాలను ఈ వేదిక ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఇండియా కూటమి భావిస్తోంది.


ఈ కార్యక్రమాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంతో మొదలుపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. ఇండియా కూటమిలోని 19 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వాదనలు వినిపించనున్నారు. ఒక్కో పార్టీ ప్రతినిధికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. వీరితో పాటు ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన బాధితులు, పౌర సమాజానికి చెందిన ముగ్గురు ప్రతినిధులు కూడా తమ అనుభవాలను, అభిప్రాయాలను వెల్లడించనున్నారు. మొత్తం 30 మంది వక్తలు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపుతో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజాస్వామ్య ప్రక్రియపై వాటి ప్రభావం, ఎన్నికల సంఘం బాధ్యత వంటి అంశాలు చర్చకు రానున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 08:11 AM