ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:52 PM
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు మంచి స్పందన వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌పో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. భారీగా ప్రదర్శనకారులు, సందర్శకులు ఈ సమ్మిట్‌కు తరలివస్తున్నారు. సమ్మిట్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మొదట కేంద్రం తెలిపింది. సమ్మిట్‌కు భారీ స్పందన వస్తుండడంతో 21వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు.. ఎక్స్‌పో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేసింది. సాయంత్రం 6 గంటలకు బదులుగా 8 గంటల వరకు పొడిగించింది. ఇక, ఈ సదస్సు కోసం 3 లక్షల మందికి పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కోసం కేంద్రం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం పది వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్‌లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. 13 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
గందరగోళంపై స్పందించిన కేంద్ర మంత్రి
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఏఐ సమ్మిట్ అనేక అద్భుతమైన పరిష్కారాలను అందించిందని అన్నారు. చిన్న చిన్న లోపాలను వెంటనే పరిష్కరించామని చెప్పారు. సమ్మిట్‌లో ఇతర ఆవిష్కరణలు, పరిష్కారాలపై దృష్టిపెట్టడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఇబ్బందులు పడ్డ ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..
టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్