పంపు కొడితే నీళ్లు కాదు.. ‘కిక్కు’ వస్తోంది!
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:36 AM
సాధారణంగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న చేతిపంపును కొట్టగానే నీళ్లకు బదులు ఘాటైన నాటుసారా ధారగా ప్రవహించింది
యూపీలో నాటుసారా తయారీదారుల
మాయాజాలం..ఓ మహిళ అరెస్టు
న్యూఢిల్లీ, నవంబరు 23: సాధారణంగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న చేతిపంపును కొట్టగానే నీళ్లకు బదులు ఘాటైన నాటుసారా ధారగా ప్రవహించింది! అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో ఝాన్సీ జిల్లా తేజ్పురా ఘురత్ గ్రామంలో ఈ నెల 21న అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంటి ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన చేతిపంపును అధికారులు స్వయంగా కొట్టిచూడగా.. అందులోంచి నీళ్లకు బదులు నాటుసారా రావడం చూసి ఆశ్చర్యపోయారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో లోతుగా గుంత తవ్వి, నాటుసారా నిల్వ చేసే ట్యాంకులను ఏర్పాటు చేశారు. దానికి సాధారణ చేతిపంపును బిగించి, అవసరమైనప్పుడల్లా సారాను తోడుకునేలా వ్యవస్థను రూపొందించారు. ఆ పంపు ద్వారా వస్తున్న సారాను పోలీసులు ఓ టబ్బులో పట్టి, ఆ తర్వాత క్యాన్లలో నింపుతున్న వీడియో వైరల్ అయింది. అధికారులు దాదాపు 30లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడే ఉన్న 1000 లీటర్ల నాటుసారా ముడి సరుకును ధ్వంసం చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న 30ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం
కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట