ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. నేడో, రేపో ప్రొఫెసర్‌కి నోటీసులు..!
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:13 AM
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య పెను సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ముంబై పవాయి పోలీసులు ఇప్పటికే ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్‌కు నేడో, రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముంబై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య పెను సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముంబై పవాయి పోలీసులు ఇప్పటికే ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై మరో కేసు పెట్టారు. దీంతో ప్రొఫెసర్‌కు నేడో, రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కేసు ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అవ్వడంతో విచారణ ఊపందుకుంది.
కాగా, ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లాపై విద్యార్థి సాహిల్ తల్లిదండ్రులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మూడు నెలలుగా తమ కుమారుడిని దుల్లా వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారని ఆరోపించారు. అలాగే, తప్పుడు కేసులో ఇరికిస్తానని, అకడమిక్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటానని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాహిల్ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడని తెలిపారు. ఈ కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
అయితే, ముంబై ఐఐటీ వాదన మరోలా ఉంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సాహిల్ పరీక్షా హాలులో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించినట్లు ముంబై ఐఐటీ ఓ ప్రకటన జారీ చేసింది. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో వేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. దీనిని ప్రొఫెసర్ గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. అయితే, సాహిల్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అనంతరం సాహిల్ తన హాస్టల్ గదికి వెళ్లి విగతజీవిగా కనిపించాడని ఐఐటీ బాంబే వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?
అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు