ఆన్‌లైన్ షాపింగ్ మోసం.. కెమెరా ఆర్డర్ పెడితే.. సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి..
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:14 PM
ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: నేటి కాలంలో షాపింగ్‌కు అర్థమే మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా అవసరమైన వస్తువులు ఆర్డర్ పెట్టుకోవటం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హుబ్బళ్లికి చెందిన ఆల్‌ఫ్రెడ్ అనే వ్యక్తి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే బిజినెస్ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు తన సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి కోసం అమెజాన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టాడు. దాని విలువ 60 వేల రూపాయలపైనే ఉంది. శనివారం ఈ పార్సిల్ ఓ ప్రైవేట్ హోటల్ అడ్రస్‌కు వచ్చింది. అతడు వెళ్లి పార్సిల్ తీసుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. 60 వేల రూపాయల కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆల్‌ఫ్రెడ్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు.
వారినుంచి సరైన స్పందన రాలేదు. ఈ సంఘటనపై ఆల్‌ఫ్రెడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను దుబాయ్‌లో ఉన్నపుడు చాలాసార్లు అమెజాన్ నుంచి వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ సారి నా ఫ్రెండ్ కోసం కెమెరా ఆర్డర్ పెట్టాను. కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. పార్సిల్ ఓపెన్ చేసే సమయంలో వీడియో కూడా తీశాం. ఆ సాక్ష్యం మా దగ్గర ఉంది. అయినా కూడా అమెజాన్ వాళ్లు సరిగా స్పందించటం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి
మహిళల ఆసియా కప్ ఫైనల్: బంగ్లా చిత్తు.. భారత్‌దే టైటిల్
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. చర్చలు రీషెడ్యూల్..