చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో యువ నటి మృతి..
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:40 PM
యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని ఇంట్లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హర్యాన్వి చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని ఇంట్లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి అప్పటికే చెయ్యిదాటి పోయింది. మార్గం మధ్యలోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దివ్యాంక మరణంపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లకే గుండె పోటు కారణంగా ఆమె మరణించటం బాధకరమంటున్నారు.
దివ్యాంక మరణంపై ఆమె కుటుంబసభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చెయ్యలేదు. ఈ రోజు సాయంత్రం దివ్యాంక అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, దివ్యాంక ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఆమె చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి బీసీఏ పట్టా పొందారు. సిక్కింలో ఎంబీఏ చేశారు. సినిమాల్లోకి రాకముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేసేవారు.
ఓ వీడియో వైరల్ అయి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. దివ్యాంక ప్రముఖ సింగర్ మసూమ్ శర్మతో కలిసి పలు వీడియో సాంగ్స్ చేశారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
పిఠాపురం ప్రోటోకాల్ వివాదం.. నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్