రోడ్డు మధ్యలో చేతి పంపు.. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట! వీడియో వైరల్
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:55 AM
మీర్జాపూర్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో జరిగిన అధికారుల నిర్లక్ష్యం విస్మయానికి గురిచేస్తోంది. రోడ్డు మధ్యలో హ్యాండ్ పంప్‌ను అలాగే వదిలేసి తారు రోడ్డు వేయడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఎంత వేగంగా పనులు పూర్తి చేస్తారో, అదే సమయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో చెప్పడానికి మీర్జాపూర్ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. సీఎం వస్తున్నారన్న హడావిడిలో రోడ్డు మధ్యలో చేతి పంపు (Hand pump ) ఉందన్న విషయం మరిచి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు అధికారులు. ఈ ఘటన మీర్జాపూర్ జిల్లా కాంతిత్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజా పనుల శాఖ (PWD) తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారని అధికారులు తెగ హడావిడి చేశారు. ఇందులో భాగంగానే మీర్జాపూర్ జిల్లా కాంతిక్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను జట్ స్పీడ్‌తో పూర్తి చేశారు. ఈ క్రమంలోనే రోడ్డు మధ్యలో చేతిపంపు ఉన్న విషయం మరిచారు. దాన్ని తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి చేరడంతో హడావిడిగా చేతి పంపును తొలగించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..
భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!